iDreamPost
android-app
ios-app

లాలూ కుటుంబంపై నితీశ్ వ్యక్తిగత దూషణ

లాలూ కుటుంబంపై నితీశ్ వ్యక్తిగత దూషణ

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా మారడంతో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండోదశ ఎన్నికల ప్రచారం గతి తప్పి వ్యక్తిగత దూషణలకు దారి తీస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం నితీశ్ కుమార్ లాలూ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో లాలూ కుటుంబంపై సీఎం నితీశ్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. కూతుర్లపై నమ్మకం లేనందువల్లే కొడుకు కోసం ఎనిమిది, తొమ్మిది మంది పిల్లలను కన్నారని లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం నితీశ్‌ విమర్శలు సంధించాడు. వారిని ఎవరైనా పట్టించుకున్నారా..? లాలూ రాజకీయాలలో కుమార్తెలను ప్రోత్సహించకుండా కేవలం కొడుకులను మాత్రమే ప్రోత్సహించారని సీఎం నితీశ్‌ ఆరోపించాడు. ఇలాంటి ఆదర్శంతో బీహార్ ఎలా అభివృద్ధి చెందుతుంది. మీకు ఎలాంటి బీహార్ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్‌ కుమార్‌ కోరాడు.

తాజాగా తన కుటుంబం గురించి సీఎం నితీశ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మహిళలను నితీశ్ కించపరుస్తున్నారని తేజస్వీ దుయ్యబట్టాడు. మా అమ్మ మనోభావాలను దెబ్బ తీశారని ఆయన ధ్వజం ఎత్తాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి ప్రధాన సమస్యలపై సీఎం నితీశ్ మాట్లాడాడని తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించాడు.

ఇక జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన తేజస్వీ వివాదంలోకి ప్రధాని నరేంద్ర మోడీని కూడా లాగారు. మా కుటుంబం గురించి మాట్లాడే ముందు ప్రధాని మోడీ గురించి కూడా సీఎం నితీశ్‌ ఆలోచించాల్సింది. ఆరుగురు తోబుట్టువులు ఉన్న ప్రధాని మోడీని కూడా నితీశ్‌ టార్గెట్ చేసినట్లు ఉందని వ్యాఖ్యానించాడు. దీంతో నితీశ్ వ్యాఖ్యలతో పాటు తేజస్వీ ఘాటైన స్పందన కూడా ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది.

కాగా ఎన్నికలలో లబ్ధి కోసం మహిళల సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు సీఎం నితీశ్ చేసిన వ్యాఖ్యలు బూమ్ రంగ్ అయి ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.