iDreamPost
iDreamPost
రాష్ట్రాల విభజన నుంచి ప్రత్యేక హోదా వరకూ అన్నింటినీ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఆయా రాష్ట్రాల అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వానికి పట్టని అంశంగా మారింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇది రూఢీ అయ్యింది. మరోసారి ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రభుత్వ కప్పదాట్లు దానిని నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని చెప్పిన మాటలను, ఎన్నికల సభల్లో మోదీ ఇచ్చిన హామీలను తోసిపుచ్చేసి ఏపీకి టోపీ పెట్టారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి మాట ఇచ్చి తప్పిందన్నది సుస్పష్టం. అదే సమయంలో బీహార్ కి కూడా 2015 ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. అయినా ఆపార్టీకి బీహారీల్లో ఆదరణ దక్కలేదు. చివరకు జేడీయూ, ఆర్జేడీ మధ్య తగాదాతో బీజేపీ గూటికి నితీష్ చేరడంతో బీజేపీకి బీహార్ లో కూడా అధికారం దక్కింది. 2020 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఆ కూటమి అధికారం నిలబెట్టుకుంది.
ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమని, ప్రణాళికా సంఘం రద్దయ్యింది కాబట్టి ఇక హోదా అనే అవకాశం లేదని కేంద్రం పలుమార్లు ఏపీ వాసులకు తెలియజేసింది. పార్లమెంట్ లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ప్రశ్నించిన ప్రతీసారి కశ్మీర్ వంటి రాష్ట్రాలకే హోదా తొలగించిన తర్వాత కొత్తగా రాష్ట్రాలకు హోదా అవకాశం ఉండదని కూడా తేల్చింది. నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అనేది కొత్తగా ఏ రాష్ట్రాలకు కేటాయించే అవకాశం లేదని తెలిపింది. అయినా ఏపీకి గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా చెప్పడం, దానికి అప్పట్లో బీజేపీలు ప్రశ్నించడమే కారణం కాబట్టి హోదా పరిశీలించాలని నేటికీ తెలుగు ప్రజలు కోరుతూనే ఉన్నారుు. ఏపీకి హోదా ఇవ్వాలని తాము కూడా డిమాండ్ చేస్తామని గతంలో తెలంగాణా పాలకపక్షం కూడా చెప్పింది.దేశంలోని వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. అయినా మోదీ మనసు కరగలేదు.
Also Read : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతున్నది బీజేపీయేనట!
హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిలకడలేమి కూడా ఏపీకి శాపంగా మారిందన్నది కాదనలేని సత్యం. ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టకుండా ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజల ఆశలను నీరుగార్చడంలో చంద్రబాబుది కీలకపాత్ర. అప్పట్లో అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ ప్రకటనే పెద్ద ఘనవిజయం అంటూ బాబు చేసిన ధన్యవాద తీర్మానాలు రాష్ట్రానికి కీడు చేశాయనడంలో అతిశయోక్తి కాదు. రావాల్సిన హోదాని వదిలేసి ప్యాకేజీ భ్రమల్లో బాబు చేసిన విన్యాసాల ఫలితం నేటికీ రాష్ట్రం అనుభవిస్తోంది తద్వారా మోదీ మాట తప్పడం, బాబు మాట మార్చడం మూలంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కలగా మారింది.
ప్రత్యేక హోదా కోసం పదే పదే జగన్ ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదు. కానీ అదే సమయంలో బీహార్ కి మాత్రం ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందంటూ తాజాగా నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటన ఏపీ వాసులను విస్మయానికి గురిచేస్తోంది. ఏపీకి లేదని చెప్పిన హోదా బీహార్ కి పరిశీలనలో ఉందనే ప్రకటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీకి లేదని చెప్పి, బీహార్ కి పరిశీలించడమనే సవతి ప్రేమ అంశం ఆందోళనకరంగా కనిపిస్తోందిి. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఒక న్యాయం. దక్షిణాది పట్ల మరో రీతిలో వ్యవహరిస్తోందనే విమర్శలకు ఇది వంత పాడుతోంది. అయితే నీతి ఆయోగ్ వ్యవహారం కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఏపీకి ససేమీరా అని చెప్పి బీహార్ ని పరిశీలిస్తున్నామనే ప్రకటన ఎలా చేస్తారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మోదీ ప్రభుత్వం ఏపీ పట్ల , ఏపీ అభివృద్ధి పట్ల శీతకన్ను వేసినట్టుగా ఈ పరిణామాలు చాటుతున్నాయి.
Also Read : సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫ్లిప్ కార్ట్ సీఈఓ కీలక భేటీ.. భారీ పెట్టుబడులకు ప్రణాళికలు