iDreamPost
android-app
ios-app

“నిర్వాణ” హాస్పిటల్ అధినేత హత్య ?

“నిర్వాణ” హాస్పిటల్ అధినేత హత్య ?

నిర్వాణ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఓం ప్రకాష్ కుక్రేజా, మరియు అతని దగ్గర హెచ్ఆర్ మేనేజరుగా పనిచేసే ఉద్యోగిని సుదీప్త ముఖర్జీ లు కారు లోపల చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 16 లో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ఉదయం 7.30కి వైట్ కలర్ వెంటో కారులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. విచారణలో వారిని ఓం ప్రకాష్ కుక్రేజా అతని దగ్గర పనిచేసే ఉద్యోగిని సుదీప్త ముఖర్జీలుగా గుర్తించారు. ఓం ప్రకాష్ తన లైసెన్స్ గల తుపాకీతో సుదీప్తను ఆమె ఛాతీపై కాల్చి, ఆపై తన తలపై కాల్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఓం ప్రకాష్ కుక్రేజాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుదీప్త ముఖర్జీ తన తల్లి మరియు భర్తతో కలిసి నివసిస్తుంది. మంగళవారం రాత్రి ఒక పెళ్ళికి హాజరు కావడానికి కుక్రేజా మరియు సుదీప్త ఇద్దరూ కలిసి వెళ్లారని సమాచారం. ఈ హత్య మరియు ఆత్మహత్యల వెనుక వివాహేతర సంబంధమే కారణమా లేక ఆర్ధిక లావాదేవీల కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. కుక్రేజాకు ఏ విధమైన ఆర్ధిక, వ్యక్తిగత ఒత్తిడి లేదని అతని స్నేహితుడు వెల్లడించాడు.ఈ ఘటనపై విచారణకు ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసుగా నమోదు చేసారు.