నిన్న నితిన్ చెక్ తో సహా మరో ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం చూశాం. క్రేజ్ పరంగా ఒక్క చెక్ మాత్రమే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది కానీ టాక్ మాత్రం డివైడ్ గా ఉండటంతో వసూళ్ల విషయంలో మరీ ఎక్కువగా ఆశించడం కష్టమనేలా ఉంది. వీటి సంగతలా ఉంచితే ఓటిటిలో కూడా ఓ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే నిన్నిలా నిన్నిలా. జీ ప్లెక్స్ ద్వారా పే పర్ వ్యూ మోడల్ లో 149 రూపాయలు టికెట్ ధర నిర్ణయించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ, నిత్య మీనన్ హీరోయిన్లు గా చేయడంతో ప్రేక్షకుల్లో ఓ మాదిరి ఆసక్తిని రేపింది. మరి ఈ రెండు గంటల సినిమా ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం
చిత్రమైన శరీరాకారంతో బాధపడుతూ అందరి చేత అవమానాలు పొందుతున్న చెఫ్ దేవ్(అశోక్ సెల్వన్)కు లైఫ్ పట్ల ఎలాంటి దృక్పథం ఉండదు. కొన్ని పరిణామాల తర్వాత ఓ మాస్టర్ చెఫ్ (నాజర్)దగ్గర పనిచేయడానికి లండన్ వెళ్తాడు. అక్కడ తారా(రీతూ వర్మ)పరిచయమవుతుంది. ఇద్దరూ అనుకోకుండా కిచెన్ లో చిక్కుకుపోయి పరిస్థితి వస్తుంది. అప్పుడే దేవ్ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న మాయ(నిత్య మీనన్)గురించి తారాకు తెలుస్తుంది. ఈలోగా ఇతనితో ప్రేమ మొదలవుతుంది. అసలు ఈ ముగ్గురి ప్రయాణంలో ఎవరెవరు ఎవరిని కలుసుకున్నారు చివరికి ఏమైంది లాంటిదంతా మీ ఫోన్లోనో టీవీలోనో చూసి తెలుసుకోవాల్సిందే
పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే అశోక్ సెల్వన్ బాగానే చేశాడు. పరిచయం లేని మొహమే అయినా మంచి ఈజ్ తో ఆకట్టుకుంటాడు. రీతువర్మ పర్లేదనిపిస్తుంది కానీ మరీ గొప్ప పాత్ర కాదు. నిత్య మీనన్ ఎప్పటిలాగే ఓకే అనిపించేసింది.సత్య, నాజర్ లు తమకిచ్చిన మేరకు చేసుకుంటూ పోయారు. దర్శకుడు శశి ఆలోచన మంచిదే అయినప్పటికీ రెండు గంటల నిడివికి సరిపడేంత సరుకు ఇందులో లేకపోవడంతో సినిమాలో అధిక శాతం సహనానికి పరీక్ష పెట్టి నిద్రపుచ్చుతుంది. టన్నుల కొద్దీ ఓపిక, ఇలాంటి స్లో రామ్ కామ్ ఎంటర్ టైనర్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటే తప్ప ఇది మెప్పించడం చాలా కష్టమనేలా సాగింది. ప్రత్యేకంగా టికెట్ ధర చెల్లించి మరీ సంతృప్తి పడేంత విషయమైతే నిన్నిలా నిన్నిలాలో లేదనే చెప్పాలి