iDreamPost
iDreamPost
ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు.. గురువారం నాడు అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు పంపించిన నోటీసులకు సమాధానంగా లేఖ పంపించారు. అసెంబ్లీ కార్యదర్శికి రాసిన సమాధానంలో నిమ్మగడ్డ ఆసక్తికరంగా స్పందించారు.
తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్ కమిటీకి లేదని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లితే స్పందించే ప్రివిలైజ్ కమిటీ ముందు గతంలో అనేక మంది ప్రముఖులు హాజరయిన అనుభవాలున్నాయి. మహారాష్ట్రలో ఎస్ఈసీని ఏకంగా రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన చరిత్ర కూడా ఉంది. కానీ తాజాగా నిమ్మగడ్డ మాత్రం తాను ప్రివిలైజ్ కమిటీ పరిధిలోకి రానంటూ పేర్కొన్నడం చర్చనీయాంశం అవుతోంది. ఎస్ఈసీ సహా ఎవరినైనా విచారించే అధికారం ఉన్న అసెంబ్లీ కమిటీ పరిధిలో తాను లేనని ఆయన చెప్పడం విశేషంగా కనిపిస్తోంది.
Also Read:ఆ నియోజకవర్గంలో గత పాతికేళ్లుగా గెలిచినోళ్లు,ఓడినోళ్లు అందరూ ఒకే గూటికి చేరారు..!
అదే సమయంలో తనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్న అంశాలకు ఆధారాలు చూపించాలని నిమ్మగడ్డ కోరడం గమనార్హం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరు మీద ఫిర్యాదులకు ప్రివిలైజ్ కమిటీ స్పందించి ఈ నోటీసులు ఇచ్చింది. మరో మంత్రి బొత్సా చేసిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా తన వాదన వినిపించాల్సి ఉండగా, తాను అసలు విచారణ పరిధిలోకి రానని పేర్కొన్న నిమ్మగడ్డ అంతలోనే తనపై చేసిన అభియోగాలకు ఆధారాలు కావాలని కోరడం విస్మయకరంగా కనిపిస్తోంది.
దాంతో పాటుగా తనకు అసెంబ్లీతో పాటుగా సభ్యుల పట్ల కూడా పూర్తి గౌరవం ఉందని ఆయన వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున ప్రయాణం చేయలేనని కూడా లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు తనకు వ్యవస్థల పట్ల విశ్వాసం ఉందని చెబుతూ, తాను అసెంబ్లీ కమిటీ పరిధిలోకి రానని పేర్కొంటూ మరోవైపు తాను ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని చెప్పడం కూడా నిమ్మగడ్డ కొంత గందరగోళంలో ఉన్నారా అనే సందేహం కలిగిస్తోంది. మొత్తంగా ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్టయ్యింది. నిమ్మగడ్డ లేఖ నేపథ్యంలో కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరమే.