దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య వెనుక కీలక మైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ తన మృతికి కారణంగా రాసిన 15 పేజీల లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగాను కాక పుట్టిస్తోంది. పోస్టుమార్టం నివేదికలో ఎంపీ మెడకు ఉరి బిగించుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు నివేదిక వచ్చింది. దీంతో ఆత్మహత్య అంశం మీద స్పష్టత వచ్చినా, వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్నది ప్రశ్నగా మారింది.
15 పేజీల లేఖ!
మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకున్న హోటల్ రూమ్ నుంచి ఆయన స్వహస్తాలతో రాసినట్లుగా చెబుతున్న 15 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆలస్యంగా బయటకు వచ్చింది. సంఘటన జరిగినప్పుడు అసలు ఎలాంటి సూసైడ్ నోట్ లు దొరికినట్లు బయటపెట్టని పోలీసులు, దీనిపై పలు మీడియాలో కథనాలు రావడంతో బుధవారం 15 పేజీల లేఖ లభ్యమైనట్లు చెబుతున్నారు. సూసైడ్ నోట్ ను ఎంపీ తన అధికారిక లెటర్ హెడ్ మీద, గుజరాతీ భాషలో, వస్త్రాలతో రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా అందులో ఆయన పేర్కొన్నారు. దీంతో ఇపుడు ఎంపీ అసలు 15 పేజీల సుదీర్ఘ లేఖ లో ఏ అంశాలను ప్రస్తావించారు ఎవరి పేర్లను రాసారు అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఏం రాశారు అన్నది పోలీసులు మాత్రం బయటపెట్టడం లేదు.
డ్రైవర్ ను విచారిస్తున్న పోలీసులు
సోమవారం ఉదయం సౌత్ ముంబైలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఉదయం ఆయన హోటల్ రూమ్ కి వచ్చిన డ్రైవర్ తలుపు కొట్టగా, ఎంతకు తలుపు తెరుచుకోక పోవడంతో డ్రైవర్ వెంటనే పోలీసులకు హోటల్ సిబ్బందికి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. హోటల్ సిబ్బంది అక్కడకు వచ్చి చూడగా ఎంపీ గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాల్కనీలో నుంచి హోటల్ గది లోకి వెళ్లి చూడగా అక్కడ ఎంపీ విగతజీవిగా పడి కనిపించాడు. సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించగా వారు రంగ ప్రవేశం చేశారు. మొదట ఎంపీ ను చూసిన డ్రైవర్ తో పాటు ఆయన బాడీగార్డులు పోలీసులు ఏం జరిగింది అన్న దానిమీద విచారిస్తున్నారు.
గతేడాది వీడియో హల్చల్
మోహన్ మృతి చెందిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. గతేడాది మోహన్ లోక్ సభలో ప్రసంగించిన వీడియో మీద సైతం చర్చ సాగుతోంది. గత నాలుగు నెలలుగా కొందరు అధికారులు నన్ను అవమానించారని, తప్పుడు కేసులు బనాయించారని చూస్తున్నారని లోక్ సభ సాక్షిగా ఆయన ఆరోపణలు గుప్పించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా కొందరు అధికారులు తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నించారని, కనీసం బయటకు రావడానికి కూడా అనుమతించలేదని, దీంతో నియోజకవర్గ ప్రజలకు కనీస సహాయం చేయలేక పోయాననన్నారు. కేంద్ర పాలిత రాష్ట్రాల నగర్ హవేలీ ముక్తి దివాస్ సందర్భంగా అధికారులు తమను దారుణంగా అవమానించారని, 35 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దాద్రా నగర్ హవేలీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లేకుండా అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మహత్య లో అధికారుల ప్రమేయం, అవమానం కూడా ఉండి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అసలు 15 పేజీలను పైగా లేఖ రాసి ఎంపీ ఆత్మహత్య చేసుకోవడం లో ఎలాంటి కారణాలు ప్రేరేపించి ఉంటాయి అన్న విషయం అంతుబట్టడం లేదు. అయితే ఈ వీడియోలో ఉన్న అంశాలను పరిశీలిస్తే మోహన్ మీద కేంద్రం ఎంత నిరంకుశ వైఖరి ప్రదర్శించేందుకు అర్థమవుతుందని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి.