iDreamPost
android-app
ios-app

కొత్త రెవెన్యూ చట్టమే అడిషనల్ కలెక్టర్‌ను పట్టించిందా?

కొత్త రెవెన్యూ చట్టమే అడిషనల్ కలెక్టర్‌ను పట్టించిందా?

ఎకరానికి లక్ష చొప్పున 112 ఎకరాలకు 1.12 కోట్ల లంచం డీల్ కుదిరింది. మొదటి విడతలో రూ.19.05 లక్షలు రెండో విడతలో ఆగస్టు 7న మరో రూ.20.05 లక్షలు మొత్తం 40 లక్షలు అందాయి. మరో 72 లక్షల కోసం ఐదు ఎకరాల స్థలం అడిషనల్ కలెక్టర్ బినామీకి అమ్మినట్లు ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మరో 8 బ్లాంక్ చెక్కులు కూడా బాధితుడు లింగమూర్తి అదనపు కలెక్టర్ నగేష్ కు ష్యూరిటీగా ఇచ్చాడు. కానీ ఇంతలోనే ఏసీబీ అధికారులకు లింగమూర్తి పిర్యాదు చేయడం వాళ్ళు 12 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో అదనపు కలెక్టర్ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది.

డీల్ మొత్తం పూర్తయి తుది దశకు చేరుకున్నాక బాధితుడు లింగమూర్తి ఏసీబీ అధికారులకు పిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించడమే కారణమని తెలుస్తుంది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా భూ రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు విఆర్వో వ్యవస్థను రద్దు చేయడం, అధికారుల అధికారాల్లో కోత విధించడంతో లింగమూర్తికి తన భూమి పని అవుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. అదనపు కలెక్టర్ నగేష్ కూడా తన పని చేయలేడని లింగమూర్తి నమ్మడంతో ఎలాగైనా తానిచ్చిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతుంది.

కాగా మరో ఏడాదిలో ఐఏఎస్ అధికారిగా మారనున్న సమయంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడటం విశేషం. గతంలో ఆయన గ్రూప్‌ -2 ద్వారా సెక్రటేరియట్‌ సర్వీస్ కు ఎంపిక లాగా సెక్రటేరియట్‌లో ఏఎస్‌వో, ఎస్‌వోగా పనిచేసి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. మరో ఏడాది గడిస్తే ఐఏఎస్‌ అయ్యే అవకాశం ఉన్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు.