iDreamPost
iDreamPost
అమరావతిలో కొత్త ఉద్యమం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే రైతుల పేరుతో టీడీపీ నడుపుతున్న ఉద్యమం నీరుగారిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 300 రోజులంటూ వివిధ వేడుకలు నిర్వహించేలా టీడీపీ ప్రణాళిక వేసినా పెద్దగా ఫలితం రాలేదు. ప్రజల్లో కదలిక లేదు. సుదీర్ఘకాలం పాటు చేస్తున్న పోరాటం ఫలించే అవకాశం లేదనే సంకేతాలు ప్రబలంగా ఉండడంతో పలువురు జారిపోతున్నారు.
దాంతో టీడీపీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమరావతిలో నిరసనలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా వాటికి కూడా ఆదరణ లేకపోవడంతో క్రమంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం క్రమంగా చల్లారిపోయినట్టుగానే భావించాలి.
సరిగ్గా అదే సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా కొందరు రోడ్డెక్కడం ఆసక్తిగా కనిపిస్తోంది. పాలనా వికేంద్రీకరణకు అనూహ్యంగా అమరావతిలోనే మద్ధతు లభిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా అంటూ అమరావతిలో ఆందోళనకు పూనుకోవడం ఆశ్చర్యంగా మారింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్ వద్ద మూడు రోజులుగా రాజధాని గ్రామాల రైతులు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా సాగుతున్న ఈ దీక్షల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. దళిత బహుజన పరిరక్షణ సమితి పేరుతో ఈ కార్యక్రమం సాగిస్తున్నారు.
అమరావతి పేరుతో తమకు జరిగిన అన్యాయంచేశారని దళిత బహుజన పరిరక్షణ సమితి చెబుతోంది. తమను మోసం చేసి టీడీపీ నేతలు భూములు లాక్కున్నారని వారు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్లా అభివృద్ధి జరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు వారు చెబుతున్నారు. వారికి వివిధ సంఘాలు మద్ధతుగా నిలుస్తున్నాయి. దాంతో ఇదిప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓవైపు అమరావతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. తాజాగా కేంద్రమంత్రి గడ్కరీ తో జగన్ పాలనా రాజధాని గురించి ప్రస్తావించారు. విశాఖ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ తరుణంలో కోర్టులో కేసుల విషయంలో కూడా రోజువారీ విచారణ సాగుతున్నప్పటికీ చట్టాలను పూర్తిగా తిప్పికొట్టే అవకాశం లేదని న్యాయనిపుణుల వాదన. దాంతో అమరావతి వ్యవహారంలో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా దళిత, బహుజనుల పేరుతో ఉద్యమం ముందుకు రావడం కీలక పరిణామంగా కనిపిస్తోంది. అమరావతితో పాటుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే డిమాండ్ తో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు.