ఈ ‘బుల్లెట్టు బండి…’ పాట సోషల్ మీడియాలో సృష్టిస్తున్న సంచలనం వెనక ఒక ప్రత్యేకత ఉంది. ఆ కొత్త పెళ్ళికూతురు ఏ పాటకయితే డాన్స్ చేసిందో ఆ పాటలోని వాక్యాలు ఆమె పాలిట నిజమై కూర్చున్నాయి. ఆ పాటలోని వాక్యాలలో అక్షరాలలో యథాతధంగా రాసి ఉన్నట్లే తన భర్తకు, మెట్టినింటివారికి ఆ అమ్మాయి ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. ఆ నవవధువు సాయిశ్రియకు పెళ్ళిపట్ల, తన కాబోయే భర్తపట్ల ఆపేక్ష, ఆశలు, నమ్మకం ఎంత బలంగా ఉన్నాయోగానీ, ఆ ప్రకృతి(లా ఆఫ్ ఎట్రాక్షన్‌లో చెప్పే యూనివర్స్) విని తథాస్తు అనినట్లుంది. రాత్రికి రాత్రి ఇన్‌స్టంట్‌గా తాను సెలబ్రిటీ అవ్వటమే కాదు తన భర్తకు, మెట్టినింటివారికి, పుట్టింటివారికి కూడా కనీవినీ ఎరగని గుర్తింపు తీసుకొచ్చింది.
ఈ పాట గత నాలుగురోజులుగా యూట్యూబ్‌ను కుదిపేస్తూ, ట్రెండింగ్ వీడియోల లిస్ట్‌లో టాప్ 3 స్థానాలలో ఉంటూ జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఏ యూట్యూబ్ ఛానల్‌వాళ్ళు ఈ వీడియోను అప్‌లోడ్ చేసుకున్నాసరే, మిలియన్లలో(మాటవరసకు కాదు, నిజంగానే మిలియన్‌లు) వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఆ అమ్మాయి ఏ పాటకయితే డాన్స్ చేసిందో ఆ ఒరిజినల్ పాట(ఈ లింక్‌లో ఉంటుంది – https://www.youtube.com/watch?v=xQauklmE3Y8&lc=Ugy05eIf0U7KwJ4s_zp4AaABAg.9RDOkM15Lu99REFmI0dKoO )కన్నాకూడా ఈ పాటే ఎక్కువ సక్సెస్ అయింది. ఒరిజినల్ పాటకుకూడా మంచి విజయాన్ని చేకూర్చిపెట్టింది. పాట రాసిన గీతరచయితకైతే దశ తిరిగిపోయింది. ఎవరి నోట విన్నా, ఏ ఫంక్షన్ హాలులో/ఆటోల్లో/బస్సుల్లో విన్నా ఇదే పాట. మరోవైపు ఈ పాటను స్ఫూర్తిగా తీసుకుని అనేకమంది దీనికి కవర్ సాంగ్‌లు(బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సూపర్ హిట్ పాట పెట్టుకుని తమదైన శైలిలో డాన్స్ చేస్తూ చేసే వీడియోలు) యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఎందుకింత సక్సెస్ అయింది?!!?
ప్రధానంగా రెండు అంశాలు దీని మెగా సక్సెస్‌కు కారణం.
1. పాటలోని హృదయాన్ని హత్తుకునే సాహిత్యం
కొన్ని పాటలు వినగా, వినగా బాగున్నట్లు అనిపిస్తుంది. మరికొన్ని ఈ బుల్లెట్టు పాటలాగా, ఇలా వినగానే అలా ఆకట్టుకుంటాయి. ఈ పాటలోని సాహిత్యం అందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళకు వెంటనే కనెక్ట్ అయ్యేటట్లుగా ఉండటమే కారణం. పెళ్ళీడుకు వచ్చిన అమ్మాయిలు ఎవరో ఒక రాకుమారుడు గుర్రంపై వచ్చి తనను వలచి వరించి తీసుకెళతాడని ఊహలు కనటం సహజం. ఈ పాటలో అమ్మాయి కూడా అలాగే తన భర్త బుల్లెట్ బండిపై వస్తాడని కలలు కంటోంది. తన పుట్టినింటి ఘనతను చెప్పుకుంటూనే, మెట్టినింటివాళ్ళను కన్నవాళ్ళలాగా చూసుకుంటానని, భర్తకు కష్టసుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటానని అంటోంది. ఈ మాటలన్నింటినీ తెలంగాణ వాడుకభాషలో ఆత్మీయత, అనురాగాలను రంగరించి పాడినట్లుగా ఉండటంతోనే ఇంతగా సక్సెస్ అయింది.
2. పాటను, పాటలోని వాక్యాలను మనసునిండా నింపుకుని, ఓన్ చేసుకుని, అదే ఫీల్‌తో డాన్స్ చేసిన కొత్త పెళ్ళికూతురు సక్సెస్‌కు రెండో కారణం.
ఈ అమ్మాయి సాయిశ్రియ బీటెక్ చదివారు. కరీంనగర్ జిల్లా జన్నారం ప్రాంతానికి చెందినవారు. ఈనెల 14న జన్నారంలో జరిగిన తన పెళ్ళి బరాత్ వేడుకలో ఆమె ఈ బుల్లెట్టు బండి… పాటకు డాన్స్ చేశారు. ఆ పాటను పెళ్ళికి హాజరైనవారిలో కొందరు షూట్ చేసి ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై అప్ లోడ్ చేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, కరీంనగర్ వాసి అయిన పి. నరహరి(ఈయనకూడా గీతరచయిత, గ్రంథ రచయిత) దీనిని ట్వీట్ చేయటంతో వైరల్ అయింది. నిశితంగా గమనిస్తే, 5 నిమిషాలపాటు సాగిన ఆ పాటలో ఆ అమ్మాయి ఉత్సాహం, స్పిరిట్ ఎక్కడా అణువంతైనా తగ్గకుండా స్టెడీగా ఉండటం చూడొచ్చు. అదికూడా అంతమంది ముందు ధైర్యంగా తన భావాలను వ్యక్తీకరిస్తున్నట్లుగా డాన్స్ చేయటం విశేషంగా చెప్పుకోవాలి. పాటలోని భావాలు ఆమెకు ఎంతో నచ్చి వాటితో మమేకమైపోవటంవల్లే అది సాధ్యమయింది. ఎవరైనా ఒక కోరికను త్రికరణశుద్ధితో బలంగా కోరుకుంటే, ఆ విశ్వమే పూనుకుని ఆ కోరికను నెరవేరుస్తుందనే లా ఆఫ్ ఎట్రాక్షన్ సూత్రం ఇక్కడ నిజమయిందని అనిపిస్తుంది.
ఈ డాన్స్‌లోని పాటకు ఒరిజినల్ అయిన వీడియో సాంగ్‌ను బాహుబలి ఫేమ్ మోహన అనే తెలుగు సినీ ప్లేబ్యాక్ సింగర్ తన యూట్యూబ్ ఛానల్‌కోసం తయారుచేయించుకున్నారు. బాహుబలిలోని ‘మనోహరీ….’ పాట నుంచి మొన్నీ మధ్య వకీల్ సాబ్‌లోని ‘మగువా, మగువా…’ దాకా తెలుగు సినిమా రంగంలో మోహన ఎన్నోపాటలు పాడారు, పాడుతున్నారు. ప్రైవేట్ ఆల్బమ్‌లకోసం సొంతంగా ఓ ప్లాట్‌ఫామ్ ఉండాలని సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఈ బుల్లెట్టు బండి అనే వీడియో సాంగ్‌ను అప్‌లోడ్ చేశారు. జార్జిరెడ్డి సినిమాలోని ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డు…’ పాట దీనికి స్ఫూర్తి అనిపిస్తున్నప్పటికీ, దీని కాన్సెప్ట్ మాత్రం మోహనదే. ఔత్సాహిక తెలంగాణ గీత రచయిత లక్ష్మణ్‌ను పిలిచి తన కాన్సెప్ట్‌ను చెప్పి ఈ పాట రాయించారు. ఈ వీడియో సాంగ్‌లో ఆ పల్లెటూరి అమ్మాయిగా నటించింది కూడా గాయని మోహనే అన్న విషయం చాలామందికి తెలియదు. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో దీనిని చిత్రీకరించారు. మొదట ఒక నెల, రెండు నెలలదాకా పెద్దగా జనాలలోకి ఎక్కలేదుగానీ, తర్వాత ఊపందుకుంది. చివరికి ఈ వారంలో జరిగిన సాయిశ్రియ పెళ్ళి డాన్స్‌తో అనూహ్యమైన, అఖండమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికి ఈ వీడియోకు మూడుకోట్ల 50 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఎక్కడ చూసినా నీ పాటే వినిపిస్తోందని ఫ్రెండ్స్, చుట్టాలు ఫోన్ చేసి చెబుతుంటే సంతోషంగా అనిపిస్తోందని గాయని మోహన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాట రాయటానికి 22 రోజులు పట్టిందని రచయిత లక్ష్మణ్ చెప్పారు. 1980,90ల కాలంనాటి అమ్మాయిల మనస్తత్వాలను ఊహించుకుని ఈ పాటను రాశానని అన్నారు. పాటలో తాను పెట్టిన భావాలు అన్నీ ఆ పెళ్ళికూతురు చేసిన డాన్స్‌లో ప్రతిఫలించాయని చెప్పారు. ఆ అమ్మాయి వలనే ఈ పాట ఇంత సక్సెస్ అయిందని, తన జీవితంకూడా మారిపోయిందని అన్నారు.
షార్ట్‌టైమ్‌లో సెలబ్రిటీలు అయ్యారని ఫ్రెండ్స్ అభినందిస్తున్నారని పెళ్ళికొడుకు అశోక్ చెప్పారు. ఆయన బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఈ పాట ఎంతో అర్థవంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తన భర్తకు సర్‌ప్రైజ్ చేస్తూ performance ఇద్దామని అనుకున్నట్లు పెళ్ళికూతురు సాయి శ్రియ అన్నారు. ఈ మధ్య పెళ్ళిళ్ళలో చేస్తున్న వెల్‌కమ్‌సాంగ్‌లలోలాగా చేద్దామని అనుకున్నప్పటికీ కుదరకపోవటంతో బారాత్‌లో చేశానని తెలిపారు.
కొసమెరుపు: ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఆల్బమ్ పాటల క్యాటగిరీలో మంచి ప్రజాదరణ సంపాదించుకున్న మంగ్లికి ఈ పాటద్వారా మోహననుంచి మంచి పోటీ ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ పాటకు డాన్స్ చేసింది మా వాళ్ళని తెలంగాణవాళ్ళు ఒకవైపు, ఈ పాటను రూపొందించినది, పాడినది మా ఆంధ్రా అమ్మాయని(మోహన భోగరాజు ఏలూరు ప్రాంతానికి చెందినవారు) ఆంధ్రావాళ్ళు మరోవైపు బాకాలు ఊదుకోవటంకూడా ఎక్కవయింది.
బుల్లెట్టు బండి… పాట సాహిత్యం కింద చదువుకోవచ్చు.
నే పట్టుచీరనే గట్టుకున్నా….
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీబొట్టే పెట్టుకున్నా
పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా …..
నడుముకి వడ్డాణం జుట్టుకున్నా …
జుట్టుకునుల్లో జుట్టుకున్నా …..
దిష్టి సుక్కనే దిద్దుకున్నా ….
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా …,
పెళ్ళికూతురు ముస్తాబురో ..
నువ్వు యేడంగా వస్తావురో …
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా …
ఇట్టే వస్తారా నీ వెంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా …
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా …
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
చెరువు కట్టపోంటి
చేమంతి వనం బంతివనం చేమంతివనం
చేమంతులు తెంపి దండా
అల్లుకున్న అల్లుకునోల్లో అల్లుకున్న…..
మా ఊరు వాగంచున మల్లేవనం …
మల్లేవనములో మల్లేవనం …..
మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా … నింపుకున్నుల్లో నింపుకున్నా …
నువ్వు నన్నేలుకున్నావురో ….
దండ మెళోన యేస్తానురో …
నేను నీ ఏలుపట్టుకోని …
మల్లె జల్లోన ఎడతనురో …
మంచి మర్యాదలు తెలిసినదాన్ని …
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని ….
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా …
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో …. పిల్లనయ్యో , ఆడపిల్లనయ్యో ….
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో … ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ….
ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో… దాన్నిరయ్యో ,
ఒక్కదాన్నిరయ్యో ….
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో … ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో ..
పండు ఎన్నల్లో ఎత్తుకొని,
ఎన్న ముద్దలు పెట్టుకొని,
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా ,
నన్ను గారాలు జేసుకొని,
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను …
నీ చేతికిస్తరా నన్నేరా నేను …
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా …
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …..
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా …
వెట్టినంకుల్లో … వెట్టినంకా …
సిరిసంపద సంబురం గల్గునింకా …. గల్గునింకుల్లో … గల్గునింకా …..
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా … , అనుకుంటుల్లో అనుకుంటా .. ,
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా .… పంచుకుంటుల్లో పంచుకుంటా …….
సుక్క పొద్దుకే నిద్రలేసి , సుక్కలా ముగ్గులాకిట్లేసి… , సుక్కలే నిన్ను నన్ను చూసి ,
మురిసిపోయేలా నీతో కలిసి .. ,
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా ,
నీ తోడులో నన్ను నే మమెచ్చుకుంటా….
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా …
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని …
అందాల దునియానే సూపిత్తప్పా …
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని