iDreamPost
android-app
ios-app

ఆందోళ‌న‌ల న‌డుమ ఆమోదం..!

ఆందోళ‌న‌ల న‌డుమ ఆమోదం..!

రాజ్య‌స‌భ స‌మావేశాలు ఆదివారం ఊహించిన‌ట్లుగానే జ‌రిగాయి. వ్య‌వ‌సాయ బిల్లుల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. విప‌క్షాలు తీవ్ర స్థాయిలో నిర‌స‌న తెలిపాయి. బిల్లుల‌ను అడ్డుకునేందుకు తుద‌కంటూ ప్ర‌య‌త్నించాయి. చివ‌ర‌కు మూజువాణి ఓటుతో రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు.

బిల్లు ప్ర‌తుల‌ను చింపేసిన ఎంపీలు

లోక్‌సభలో ఆమోదం పొందిన వ్య‌వ‌సాయ బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో వాటిపై ఉదయం నుంచీ వాడీవేడి చర్చ కొన‌సాగింది. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్‌ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తృణమూల్‌ కాం‍గ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్ స‌హా ఒక‌రిద్ద‌రు ఎంపీలు బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్‌ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకు‌లు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది.

అన్న‌దాత‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం : మోదీ

రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన ‘ఉద్యమం’తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ ‘వాటర్ షెడ్ మూవ్ మెంట్’ అన్నారు. దేశంలోని రైతులను అభినందిస్తున్నానని, దశాబ్దాల తరబడి వివిధ ఆంక్షలు, మధ్య దళారుల వేధింపుల కారణంగా నష్టపోయిన అన్నదాతలకు ఈ బిల్లుల ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఆ కష్టాల నుంచి పార్లమెంట్ వారిని దూరం చేసిందన్నారు. ఈ బిల్లుల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.