Idream media
Idream media
చీలిక దిశగా అధికార పార్టీ..!
నేపాల్ లోని ప్రభుత్వం కూలనుందా..? అంటే ప్రస్తుత పరిస్తితులు అవుననే అంటున్నాయి. అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సిపి)లో చీలిక దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీ, ఎన్‌సిపి కార్య నిర్వాహక అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రచండల మధ్య అధికార పంపిణీ విషయంలో సయోధ్య కుదరడం లేదు. ఈ విషయంలో ఇరువురు అగ్ర నేతల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న అర డజను పైగా సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు.
జూలై 8న జరగాల్సి ఉన్న 45 మంది పార్టీ కీలక సభ్యుల స్టాండింగ్ కమిటీ సమావేశం జూలై 9నాటికి వాయిదా పడింది. ఇదిలా వాయిదా పడటం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా భారత్ వ్యతిరేకిగా పేరు పొందిన ప్రధాని ఓలీ పదవిని కాపాడేందుకు చైనా రాయబారి హో యాంకీ ప్రయత్నాలను ముమ్మరం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత కొద్ది నెలలుగా ఎన్‌సిపిలో అంతర్గత సంక్షోభం నెలకొంది. ఇది తన మెడకు చుట్టుకుంటుందని భావించిన ఓలీ మొత్తం విషయాన్ని దారి మరల్చేందుకు భారత్‌తో సరిహద్దు వివాదానికి తెర తీశారు. భారత్‌కు చెందిన కీలక సరిహద్దు ప్రాంతాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త రాజకీయ చిత్ర పటానికి ఆమోదం తెలిపారు. అయినప్పటికీ గత వారం నుంచి అక్కడ తిరిగి అసమ్మతి వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలను ప్రారంభించాయి.
భారత్‌కు చెందిన వార్తా ఛానళ్లను నిలిపివేత
దూరదర్శన్ మినహా భారత్‌కు చెందిన అన్ని వార్తా ఛానళ్లను నేపాల్ జూలై 9 నుంచి నిలిపేసింది. నేపాల్ విశ్వాసాలను దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ వేటు వేసింది. అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. నేపాల్ రాజకీయ పరిణామాల గురించి భారతదేశ ఛానళ్లు వెలువరిస్తున్న వార్తల తీరుపై ఢిల్లీలోని నేపాల్ దౌత్య కార్యాలయం తమ అభిప్రాయాలను భారత్‌కు తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.