iDreamPost
iDreamPost
గత నెలలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ అమ్ముడుపోయిందా?.. అందుకే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందా?.. అధినేత చంద్రబాబు లెక్క ప్రకారం అదే జరిగిందట! మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంపై జరిపిన సమీక్షలో ఆయన ఇదే చెప్పారు. ఓటమిని ఎవరో ఒకరిపై నెట్టేసే అలవాటున్న చంద్రబాబు నెల్లూరు పరాభవానికి స్థానిక నాయకత్వాన్ని బాధ్యులను చేసేశారు. నగరంలో పార్టీ దుస్థితిని, అచ్చెన్నాయుడులాంటి రాష్ట్ర నేతలు పర్యవేక్షించిన విషయాన్ని, పార్టీకి లభించిన ఓట్లలో భారీ తగ్గుదల వంటి అసలు విషయాలను పట్టించుకోకుండా డబ్బుకు అమ్ముడుపోయారని, అభ్యర్థులను అమ్మేసుకున్నారని ఆరోపిస్తూ పార్టీ స్థానిక నాయకులపై చర్యలకు ఒడిగట్టారు.
మీ సంగతి తర్వాత చూస్తా
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ టీడీపీ ఒక్క డివిజన్లోనైనా గెలవని పరిస్థితిపై జిల్లా నాయకులతో జరిపిన పోస్టుమార్టంలో నెల్లూరు సిటీ, రూరల్ నాయకులపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి మీ నిర్వాకమే కారణమంటూ సిటీ, రూరల్ ఇంఛార్జీలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలను మీ సంగతి తర్వాత చూస్తానని హెచ్చరించారు. మరో నేత కిలారి వెంకటనాయుడిని పార్టీ నుంచి బహిష్కరించారు.
24 డివిజన్లపై సమీక్షించిన చంద్రబాబు 6, 7, 8 డివిజన్లలో బలహీన అభ్యర్థులను పోటీలో పెట్టడానికి, 6, 8 డివిజన్ల అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడానికి, 7వ డివిజన్ అభ్యర్థి నామినేషన్ పరిశీలనలోనే తిరస్కరణకు గురికావడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, ఎస్టీ సెల్ నేత రంగారావులే కారణమంటూ వారిని పదవుల నుంచి తొలగించారు. అలాగే పార్టీ డివిజన్ కమిటీలన్నింటినీ రద్దు చేశారు. డబ్బులకు లొంగిపోయి అభ్యర్థులను అమ్మేసుకున్నారని, బలహీన అభ్యర్థులను రంగంలోకి దించారని, కొందరితో విత్ డ్రా చేయించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : పెనుకొండ ఓటమిపై బాబు సీరియస్ – అనంత నేతలకు క్లాస్
ఓట్లు ఎందుకు తగ్గాయి.. అచ్చెన్న పర్యవేక్షణ ఏమైంది?
సమీక్ష ఆద్యంతం అభ్యర్థులను అమ్మేశారని, నేతలు అమ్ముడుపోయారని, బలహీన అభ్యర్థులను అమ్మేశారని స్థానిక నేతలను నిలదీసి, చర్యలకు ఒడిగట్టిన చంద్రబాబు అసలు విషయాలను మాత్రం విస్మరించారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరపాలక సంస్థ పరిధిలో టీడీపీకి లభించిన ఓట్ల కంటే మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 50 వేల ఓట్లు తగ్గాయి. నేతలు అమ్ముడుపోయినంత మాత్రాన ఇంత భారీగా ఓట్లు కోల్పోయే పరిస్థితి ఎక్కడా ఉండదు. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం లేనప్పుడే ఇలా జరుగుతుంది.
చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడినే అక్కడ పది రోజులపాటు మకాం వేయించారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు. కీలకమైన అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని వారెందుకు పట్టించుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరి క్షణంలో బలహీన అభ్యర్థులను ఎంపిక చేశారని నియోజకవర్గ ఇంఛార్జీలను ఇప్పుడు తప్పుపట్టడం కంటే ఎంపిక ప్రక్రియను అగ్రనేతలు నిర్వహించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని పలువురు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీ ఓడి పోతున్న విషయాన్ని, అగ్రనేతల నిరాసక్తతను పట్టించుకోకుండా అమ్ముడుపోయామని తమను నిందించడం, చర్యలకు పాల్పడటం తగదని కిందిస్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మంచి ఛాన్స్, బాబు ఎందుకు వైసీపీ కి ఇవ్వాలనుకుంటున్నారు..?