iDreamPost
android-app
ios-app

ప్రేక్షకులకు బాలయ్య అరుదైన కానుక

  • Published Oct 20, 2020 | 8:16 AM Updated Updated Oct 20, 2020 | 8:16 AM
ప్రేక్షకులకు బాలయ్య అరుదైన కానుక

స్టార్ హీరోల సినిమాలు కొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడమో లేదా ఏవో కారణాల వల్ల అప్పటిదాకా దాకా తీసింది పక్కన పారేయడమో జరుగుతూ ఉంటుంది. అవి వెలుగులోకి రావడం చాలా అరుదు. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అనుభవమే. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది ఆగిపోయి ఆ ఫుటేజ్ ని ఇప్పుడు విడుదల చేయబోతుండటం అంటే మాత్రం ఖచ్చితంగా విశేషమే. అలాంటి అరుదైన ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు నందమూరి బాలకృష్ణ. పదహారేళ్ళ క్రితం తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాలను అట్టహాసంగా ప్రారంభించి విపరీతమైన అంచనాలు రేకెత్తించారు.ద్రౌపదిగా సౌందర్యను ఎంచుకోవడంతో సావిత్రి తర్వాత దీనికి సంపూర్ణ న్యాయం చేసే నటి ఆవిడేనని అందరూ అభిప్రాయపడ్డారు.

భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్, విరాట రాజుగా కోట శ్రీనివాసరావు ఇలా మంచి తారాగణాన్ని ఎంచుకున్నారు. దురదృష్టవశాత్తు 2004 హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. ఆవిడకు ప్రత్యాన్మాయంగా చెప్పుకునే నటి ఎవరూ లేకపోవడంతో బాలయ్య అక్కడితో నర్తనశాలను ఆపేశారు. కాలక్రమేణా శ్రీహరి, ఉదయ్ కిరణ్ లు కూడా కన్నుమూశారు. ఇప్పుడు షూట్ చేసిన భాగాన్ని 24న శ్రేయాస్ ఈటి యాప్ ద్వారా తన ఎన్బికె థియేటర్లో పే పర్ వ్యూ మోడల్ లో బాలకృష్ణ విడుదల చేయబోతుండటం ఆసక్తి రేపుతోంది. కాలం చేసిన గొప్ప నటీనటులను ఇందులో కొత్తగా చూడబోతుండటం వాళ్ళ అభిమానులకు కన్నులపండగే. 17 నిమిషాల నిడివి అంటే ఎంతో కొంత విషయం ఉండే ఉంటుంది.

దీన్ని చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా వాళ్ళ కోరిక ఇప్పుడు తీరబోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. వనవాసంలో ఉన్న అర్జునుడి గెటప్ మాత్రమే రివీల్ చేశారు. ఇందులో బాలకృష్ణ త్రిపాత్రిభినయం చేశారు. అర్జునుడు, బృహన్నల, కీచకుడుగా తనే కనిపించేలా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నారు. అయితే అన్ని రోల్స్ కి సంబంధించిన సీన్స్ ఉండకపోవచ్చు కానీ కీలకమైన ఎపిసోడ్ అయితే చూడొచ్చు. సౌందర్య ఎంతసేపు కనిపిస్తారు, శ్రీహరి, ఉదయ్ కిరణ్ ల మీద సీన్స్ తీశారా లాంటి ప్రశ్నలకు సమాధానం ఆ రోజే చూడాలి. శ్రీకృష్ణార్జున విజయం తర్వాత బాలకృష్ణ నటించిన పౌరాణిక ఇతిహాసం నర్తనశాలే. కానీ అప్పుడు వెలుగు చూడలేకపోయింది. ఇప్పుడు కనీసం డిజిటల్ ఓటిటి పుణ్యమాని బుల్లితెరలపైనే చూసుకోవచ్చు. దీని మీద ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు