iDreamPost
iDreamPost
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో ఎమోషన్స్ సరైన మోతాదులో పండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి సరిగ్గా కుదిరితే కుటుంబ ప్రేక్షకులనే కాదు మాస్ ఆడియన్స్ కు కూడా బాగా రీచ్ అవుతాయి. వసూళ్ల వర్షం కురిపిస్తాయి. పెట్టుబడి మీద నమ్మకాన్ని కలిగిస్తాయి. అలాంటి ఒక ఉదాహరణ చూద్దాం. 1995 టైంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మంచి ఫామ్ లో ఉంది. ‘బొబ్బిలి రాజా’ నుంచి సురేష్ బాబు స్వంతంగా బాధ్యతలు తీసుకున్నాక భారీ చిత్రాలు అతనికి వదిలేసి రామానాయుడు గారు మీడియం బడ్జెట్ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. ఆ టైంలో ఎంచుకున్నకథే నాయుడు గారి కుటుంబం.
అప్పుడు కమర్షియల్ సినిమా రాజ్యమేలుతోంది. కృష్ణంరాజు గారి ఫామ్ మెల్లగా. అంతిమ తీర్పు తర్వాత సోలో హీరోగా చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ సమయంలో గుహనాథన్ అందించిన ఓ కథతో పరుచూరి బ్రదర్స్ ఈయన్ను కలిశారు. స్క్రిప్ట్ మొత్తం వినిపించి బడ్జెట్, క్యాస్టింగ్ తదితర లెక్కలు కూలంకుశంగా వివరించారు. తన మార్కెట్ మీద అంత వర్కౌట్ అవుతుందాని రెబెల్ స్టార్ కి అనుమానం రాకపోలేదు. కానీ అదే బ్యానర్ లో వచ్చిన పరువు ప్రతిష్ట, తోడి కోడళ్ళు విజయాలను ఉదాహరణగా చూపించేసరికి ఇంకేమి మాట్లాడలేదు. సెంటిమెంట్ చిత్రాలతో ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న బోయిన సుబ్బారావు దర్శకుడని చెప్పేసరికి ఎక్కువ ఆలోచించలేదు. సరే అన్నాక షూటింగ్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి.
ప్రధాన పాత్ర కృష్ణంరాజు గారిదే అయినప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సుమన్ ఆయనకు తమ్ముడిగా కీలక పాత్ర చేశారు. శ్రీహరికు గుర్తింపు వచ్చే విలన్ క్యారెక్టర్ దక్కింది. సత్యనారాయణ, చంద్రమోహన్, శివకృష్ణ, ప్రసాద్ బాబు, జయంతి, స్వర్ణ తదితరులు ఇతర తారాగణం. కోటి స్వరాలు సమకూర్చగా పి సురేష్ ఛాయాగ్రహణం అందించారు. చిన్న క్యామియో తరహా విదేశీయుడి క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ సోదరుడు రాజ్ ఖేర్ కనిపిస్తారు. 1996 మే 30న ఎస్వి కృష్ణారెడ్డి ‘మావిచిగురు’తో పాటుగా నాయుడు గారి కుటుంబం రిలీజై సూపర్ హిట్ అందుకుంది. సుమారు పద్దెనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడటం రికార్డే. ఈ సినిమాకే అంత అనుభవం ఉన్న పరుచూరి బ్రదర్స్ కి మొదటిసారి నంది అవార్డు దక్కింది.