iDreamPost
iDreamPost
వివిధ పార్టీల నేతలు వైసీపీ వైపు చూస్తుంటే, వైసీపీ తరుపున గెలిచి తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన కనుమూరి రఘురామకృష్ణ రాజు వ్యవహారం మాత్రం మరో దిశలో ఉంది. ఇప్పటికే గడిచిన కొన్నేళ్లలో వరుసగా వైసీపీ నుంచి బీజేపీకి, అక్కడి నుంచి టీడీపీకి, మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి జంపింగ్ లు చేసిన ఈ రాజు ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయించేస్తున్నారనే స్థాయిలో ప్రచారం సాగుతోంది. చివరకు ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ హాల్ లో నేరుగా ఈ వైసీపీ ఎంపీని పేరు పెట్టి సంబోధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. దానికి ముందు తెలుగు మాధ్యమం విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసి, వైసీపీ అధిష్టానం వివరణ కోరేటంత వరకూ వచ్చింది.
ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు అమరావతి చేరుకున్నారు. అధినేత ఆదేశంతో ఆయన హుటాహుటీన హస్తిన నుంచి రావడం ఆసక్తిగా మారింది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తమయిన జగన్ నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్టు కనిపిస్తోంది. తొలుత గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి బాధ్యత అప్పగించారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా నర్సాపురం ఎంపీ వెనక్కి తగ్గకపోగా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో సమస్య పరిష్కారం కోసం పార్టీ అధ్యక్షుడు రంగంలో దిగినట్టు చెబుతున్నారు.
వైసీపీ ఎంపీలలో రఘురామకృష్ణం రాజు తో పాటు మరో సీనియర్ ఎంపీ పై కూడా బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టుగా సమాచారం. పారిశ్రామికవేత్తలుగా ఉన్న ఈ ఇద్దరి నేతల మీద కమలం పెద్దలు గురిపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం స్థిరంగా కొనసాగడం కాషాయ నేతలకు ఇష్టం లేదని, తమ మీద ఆధారపడేలా చేయాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే దారికి తెచ్చుకోవడానికి తగ్గట్టుగా ఝలక్ ఇవ్వాలని కమలదళం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే గతంలో ఐటీ దాడులను ఎదుర్కొన్న మరో ఎంపీని కూడా దారికి తెచ్చుకునే దిశలో కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న సుజనా చౌదరి తాజా కామెంట్స్ దానికి అద్దంపడుతున్నాయి. ఇద్దరు ఎంపీల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఏకంగా 20మంది ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
ఈ పరిణామాలను గమనంలో ఉంచుకున్న వైసీపీ అధిష్టానం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఎంపీలతో సుజనాకి గట్టి కౌంటర్ ఇప్పిస్తూనే మరోవైపు పరిస్థితి చక్కదిద్దేందుకు చర్చలు చేపట్టింది. అందులో బాగంగానే రఘురామకృష్ణం రాజుని పిలిచి, ప్రత్యేకంగా మాట్లాడేందుకు జగన్ పూనుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా మోడీ పలకరింపు విషయంపై వివరణ ఇచ్చినట్టుగా మీడియాతో మాట్లాడిన ఎంపీ తెలిపారు. యథాలాపంగా పేపర్లో వచ్చిన కథనాలపై అడిగారు..వివరణ ఇచ్చాను అంటూనే. ‘నా అంతట నేనే సీఎంకు వివరించా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని సీఎంకు నా అంతట నేనే వివరించా, నేను క్లారిటీగా ఉన్నా.. మీడియానే కన్ఫ్యూజ్ అయింది. సుజనా అలా ఎందుకన్నారో నాకు తెలియదు, మా వైసీపీ వాళ్లు చాలా మంది ఆయనపై తిరగబడ్డారంట కదా?’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘ప్రధాని మోదీ మామూలుగానే పార్లమెంట్ హాల్‌లో నన్ను పలకరించి భుజం తట్టి వెళ్లిపోయారు. గతంలో పార్టీలో పనిచేసేవారిని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ‘ఏం రాజు బాగున్నావా’ అని మోదీ పలకరించి ఉండవచ్చు. మోదీ ప్రధాని కాకముందే నాకు బాగా తెలుసు. ఆ పరిచయంతోనే పలకరించారు. పార్టీ పరంగా బీజేపీకి టచ్‌లో లేను’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంతో పరిస్థితి కొంతమేరకు సర్థుమణిగినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే రీతిలో ఇతర ఎంపీలను కూడా పిలిచి, వ్యక్తిగతంగా మాట్లాడాలని సీఎం ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. తద్వారా ఎంపీలకు గాలం వేసే దిశలో సాగుతున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలో ఉన్న పార్టీల మధ్య సంబంధాలపై వీటి ప్రభావం ఎలా ఉండబోతోందన్నది కూడా ఆసక్తికరమే.