iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ వ్యవహారాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఐటీ వ్యవహారాల మంత్రిగా ప్రభుత్వ నిధులు దారి మళ్లించారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ సాగుతున్నట్టు వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగిం చేసిన వ్యవహారం చివరకు ఎటు మళ్లుతుందోననే చర్చ మొదలయ్యింది.
దిశ ఘటన నేపథ్యంలో దేశమంతా మహిళల రక్షణకు సంబందించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ వర్గాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అ నేపథ్యంలో మహిళల రక్షణ గురించి నారా లోకేష్ కూడా ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
“ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్లను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్ళించేశాడు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడు.ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడు.58 కోట్ల స్కామ్‌పై విచారణ జరుగుతోంది.ఒపికపట్టు చిట్టీ!..” అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దాంతో 58 కోట్ల రూపాయల ప్రజాధనం సింగపూర్ కి తరలించడం వెనుక అసలు వాస్తవాలు ఏంటి, యాప్ తయారీ పేరుతో సాగించిన మస్కా ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఈ అవినీతి పై విచారణ సాగుతోందంటూ విజయసాయిరెడ్డి వెల్లడించిన నేపథ్యంలో అసలు వాస్తవాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయోననే ఆసక్తి కూడా పెరుగుతోంది.
గత ప్రభుత్వ హయంలో సాగించిన ఇలాంటి వ్యవహారాలపై తక్షణం స్పందించి, చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూనుకోవాలని పలువురు కోరుతున్నారు. ఐటీ శాఖలో భూ కేటాయింపుల వంటి భారీ కేటాయింపులు, రాయితీలు పొందిన బడా కంపెనీల వ్యవహారాలు పక్కన పెడితే కనీసం మహిళల రక్షణ కోసం కేటాయించిన నిధులు కూడా మింగేశారనే ఆరోపణల నేపథ్యంలో తాత్సార్యం చేయకుండా, వీలయినంత త్వరగా వాటి అసలు బండారం బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.