iDreamPost
iDreamPost
బాబు బండారం మళ్లీ బయటపడింది. బురద జల్లి కడుక్కోమని రాజకీయాలకు ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. చివరకు ఏరికోరి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసిన అడ్వకేట్ తో రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఈ హడావిడి వ్యవహారంలో సర్థి చెప్పుకోలేక సతమతం కావాల్సి వచ్చింది. నంధ్యాలలో మైనార్టీ అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. బాబు మార్క్ రాజకీయాలను మళ్ళీ బట్టబయలు చేసింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అడ్వొకేట్ రామచంద్రరావు రాజీనామా కి దారితీసింది. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులపై ప్రభుత్వం సీరియస్ స్పందించి, చర్యలకు పూనుకుంటే టీడీపీ నేతలు మాత్రం నిందితుల పక్షాన వాదించి బెయిల్ తీసుకురావడంతో ఈ వివాదం రాజకీయ రూపం దాల్చింది. చంద్రబాబు తీరుని మరోమారు స్పస్టంగా చాటిచెప్పింది.
చంద్రబాబుకి న్యాయస్థానాల్లో కొందరితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఇప్పటికే అనేక మార్లు ఆయన జయప్రదంగా న్యాయస్థానాల పరిధిలో నెట్టుకురాగలుగుతున్నారు. అదే క్రమంలో తన పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతగా ఉన్న న్యాయవాదిని ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు. అంతకుముందు ఆయనకు అధికారంలో ఉన్న సమయంలో కూడా కీలక పదవులు కట్టబెట్టారు. అదే న్యాయవాది సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ కేసును వాదించడానికి సిద్ధపడడ్డారు. ప్రభుత్వం ముద్దాయిలను అరెస్ట్ చేసి, జైలుకి పెడితే, టీడీపీ నేతలు వారికి బెయిల్ రావడానికి దోహదపడ్డారు. అంతటితో సరిపెట్టకుండా ప్రభుత్వమే నిందితులకు అండగా ఉందని నిందలు వేయడం మొదలెట్టారు. తామే కోర్టులో వాదించి బెయిల్ తెచ్చి కూడా దానికి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పూనుకున్నారు. చంద్రబాబు సైతం అసలు విషయం దాచిపెట్టి, జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేశారు. మైనార్టీలకు రక్షణ లేదని విమర్శలకు పూనుకున్నారు.
కానీ తీరా నిందితుల తరుపున వకాల్తా పుచ్చుకున్న బాబు సన్నిహితుల వ్యవహారం వైరల్ అయ్యింది. పోలీస్ సీఐ ని కూడా సస్ఫెండ్ చేసి, ఆరోపణలు రాగానే అరెస్ట్ చేసిన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు మిత్రులు చేసిన వ్యవహారం బయటపడింది. దానిని కప్పిపుచ్చుకుంటూ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న తీరు సోషల్ మీడియా చాటిచెప్పింది. చివరకు నిందితుల తరుపున వాదించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నంద్యాల రాజకీయాలతో రాష్ట్రమంతా మైనార్టీలలో ప్రభుత్వం పట్ల అనుమానాలు రాజేయాలని చూసిన బాబు కుట్ర బెడిసికొట్టింది.
చాలాకాలంగా టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేస్తూ నిందితుల పక్షాన ఇకపై వాదించనని చెప్పాల్సి వచ్చింది. మొత్తంగా మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి లేకుండా, దానిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూసిన బాబు వ్యవహారం బూమరాంగ్ అయ్యింది. మొత్తంగా బాధితులకు అండగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంటే, నిందితులకు తోడుగా టీడీపీ నేతలున్నారనే సంగతి వెలుగులోకి రావడం విశేషం. ప్రతిపక్షం కుట్రలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడం కోసం తామే నిందితులకు అండగా నిలుస్తున్న సంగతిని అంగీకరించాల్సి వచ్చింది.