Idream media
Idream media
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకుంటోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు అయ్యారు. నేటితో నామినేషన్ల దాఖలు కూడా పూర్తి కానుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ నాయక్‌ను ఆయా పార్టీలు ఎంపిక చేశాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అనేది ముందుగానే తెలుసు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ ఈరోజే నామినేషన్ దాఖలు చేస్తుండడం ఉత్కంఠగా మారింది. బరిలో దిగుతున్న అన్ని రాజకీయ పార్టీలూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండటంతో హోరాహోరీ పోరు అనివార్యంగా కనిపిస్తోంది.
భగత్ అభ్యర్థిత్వం వెనుక..
నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికలో టీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దివంగత సిటింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కుమార్ స్థానికేతరుడు అనే కారణంతో తొలుత ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం పక్కనపెట్టినట్లు, ఆయనకు మరో పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గురువయ్య యాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లనుప్రధానంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి భగత్‌కుమార్ వైపే టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ మొగ్గు చూపారు. ఆ నియోజకవర్గ ప్రజలు అభ్యర్థుల కంటే ముఖ్యంగా పార్టీలను చూస్తుండటం, ఇప్పటికే చేపట్టిన వివిధ సర్వేల్లో టీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతుండటం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సాగర్‌లో అధికార పార్టీ గ్రాఫ్‌లో పురోగతి కనిపించడం వంటివి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైనట్లు చెబుతున్నారు.ఉప ఎన్నిక అనేసరికి పార్టీ యంత్రాంగం మొత్తం దృష్టి పెట్టనున్న నేపథ్యంలో అభ్యర్థి వివాదాస్పదుడు కాకపోతే చాలుననే ఉద్దేశం కూడా నోముల భగత్ ఎంపికకు మరో కారణమైనట్లు సమాచారం.
బీజేపీ వ్యూహం ఇదే
టీఆర్‌ఎస్ యాదవ్ వర్గానికి టికెట్ ఇస్తే.. ఆ నియోజకవర్గంలో ఎక్కువ జనాభా కలిగిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. రెడ్డి సామాజికవర్గానికి కాంగ్రెస్, బీసీ సామాజికవర్గానికి టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గంలో ఎక్కువ జనాభా కలిగిన ఎస్టీ సామాజికవర్గం అభ్యర్థి వైపు బీజేపీ మొగ్గు చూపింది. అక్కడ పార్టీ టికెట్ కోసం ఇంద్రసేనారెడ్డి, నివేదితారెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు ప్రధానంగా పోటీ పడినప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత డాక్టర్ రవికుమార్ నాయక్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సాగర్ నుంచి పోటీ చేసిన నివేదితారెడ్డి కేవలం 2,675 ఓట్లు మాత్రమే సాధించారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అక్కడ గట్టి పోటీ ఇస్తామనే ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జానారెడ్డి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారడంతో గెలుపు కోసం జానా విశేషంగా కృషి చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో అన్నీ తానై నడిపించి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.