iDreamPost
iDreamPost
బిగ్ బాస్ 4 తప్ప బొత్తిగా ఎక్కడా కనిపించని కింగ్ అక్కినేని నాగార్జున త్వరలోనే తన కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తాజా సమాచారం. వైల్డ్ డాగ్ రిలీజ్ విషయంలో ఇంకా అయోమయం తొలగిపోనప్పటికీ ఇంకొద్ది రోజుల్లో ఓటిటినా థియేటరా అనేది తేల్చబోతున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ చేయాల్సిన కొత్త మూవీ ఎప్పుడో ప్రకటించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటిదాకా మొదలుకాలేదు. ఒకదశలో ఆగిపోయిందేమోనన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ అలాంటిదేమి లేదని, స్క్రిప్ట్ విషయంలో జరిగిన ఆలస్యం తప్ప క్యాన్సిల్ అయ్యే సమస్యే లేదని చెబుతున్నారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వచ్చే వారం నుంచే ఇది సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తెలిసింది. హైదరాబాద్, ఊటీతో పాటు లండన్ లో ఒక కీలకమైన షెడ్యూల్ తో కేవలం మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. అన్నీ అనుకూలంగా సాగితే డిసెంబర్ లో రిలీజ్ టార్గెట్ చేసినట్టు వినికిడి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనీఖా సురేంద్రన్ ను తీసుకున్నారట. విశ్వాసం, ఎంతవాడుగాని సినిమాల్లో అజిత్ కూతురిగా నటించి మెప్పించిన అనీఖా టీనేజ్ లోకి వచ్చాక కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని ఆచితూచి ఎంచుకుంటోంది. ఆ క్రమంలోనే ఈ ఆఫర్ వచ్చిందట.
అలా అని తను నాగార్జున సరసన హీరోయిన్ కాదు. ముఖ్యమైన క్యారెక్టర్ అన్నారు కానీ ఎలా ఉంటుందనే లీక్ ఇంకా బయటికి రాలేదు. హీరోయిన్ ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం లొకేషన్లతో పాటు క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదయ్యాక సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజుని తీసే ఆలోచన ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మూడేళ్ళ క్రితమే స్క్రిప్ట్ సిద్ధం చేసినా ఇప్పటికీ ఎదురు చూపులోనే ఉన్నాడు. నాగ్ చైతుల కాంబినేషన్ కాబట్టి అంత త్వరగా పట్టాలు ఎక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రవీణ్ సత్తారు సినిమా అయ్యేలోపు ఏదైనా క్లారిటీ వస్తుందేమో