iDreamPost
iDreamPost
సాధారణంగా ఈగోలు రాజ్యమేలే పరిశ్రమలో తమ సినిమాలో ఇంకో హీరో ప్రస్తావన తెచ్చేందుకు స్టార్లు అంతగా ఇష్టపడరు. కథ డిమాండ్ చేసినా సరే ఏదో ఒకరకంగా మార్పు చేసి మమ అనిపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో దర్శకుడి మాట చెల్లుబాటు కావడం చాలా అరుదు. అయితే దీనికి సై అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇడియట్ లో రవితేజ, రణంలో గోపిచంద్ మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్ గా నటించారు. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నితిన్ ఓపెన్ గా తన మూవీస్ లో పవన్ కళ్యాణ్ అభిమానిగా నేరుగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఇది పలు సందర్భాల్లో తనకు చాలా ప్లస్ అయ్యింది కూడా. ఇప్పుడు చైతు కూడా అదే తరహా ప్రయోగం చేయబోతున్నట్టు టాక్.
మనం, ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న థాంక్ యు సినిమాలో నాగ చైతన్య మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో దీని షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో భారీ ఎత్తున పోకిరి పోస్టర్లు, కటవుట్లు పెట్టారు. అచ్చంగా విడుదల తేదీన ఎలా ఉండేదో అలాంటి వాతావరణాన్ని చాలా సహజంగా పునఃసృష్టించారు. దీన్ని బట్టే కాన్సెప్ట్ ఏంటనేది అర్థమవుతోంది. అయితే శివ గెటప్ లో సైకిల్ చైన్ పట్టుకుని ఉన్న చైతు కటవుట్ కూడా అదే ప్రాంగణంలో ఉండటం కొంత కన్ఫ్యూజన్ కి దారితీసినా మొత్తానికి ఏదో ఆసక్తినైతే రేపుతోంది.
ఇప్పుడీ షూట్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో, అభిమానుల వాట్స్ అప్ గ్రూపుల్లో షికారు చేస్తున్నాయి. హలో, గ్యాంగ్ లీడర్ డిజాస్టర్ల తర్వాత విక్రమ్ కు మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం పడింది. అందుకే థాంక్ యు మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో బడ్జెట్ పరంగానూ టెన్షన్ లేదు. షూటింగ్ వేసవిలోగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.మరోవైపు లాక్ డౌన్ నుంచి ఆగిపోయిన లవ్ స్టోరీ విడుదల ఎప్పుడనే క్లారిటీ ఇంకా రావడం లేదు. సంక్రాంతికి వస్తుందేమో అని ఆశపడిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.