పలనాడుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు రైలు మొహం ఎరుగని ప్రజలు ఎప్పటి నుండే ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంలోని మొదటిదశ ఫేజ్-1 త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.
డిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై రైల్వే లైన్ కి ప్రత్యామ్నాయంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అభివృద్ధికి నోచుకోని బాగా వెనుకబడిన ప్రాంతాలని కలుపుతూ ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన చాలారోజుల నుండి ఉన్నప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం పట్టు పట్టి అప్పటి యూపీఏ ప్రభుత్వం చేత నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గానికి అన్ని పరిపాలనా అనుమతులు సాధించారు. అనంతరం ఈ ప్రాజెక్టు ని రైల్వేబడ్జెట్ లో చేర్చడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రాజెక్టు సర్వే, భూ సమీకరణ కూడా పూర్తి అయినప్పటికీ తరువాత వచ్చిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కాస్త ఆలస్యం అయ్యింది.
అయితే ఎట్టకేలకు నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం మొదటి దశ ఫేజ్-1లో నిర్మాణం పూర్తి చేసుకున్న గుంటూరు జిల్లాలోని శావల్యపురం నుండి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వరకు మొదటిసారి ట్రైల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా శావల్యపురం రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు ఇంజన్ వేల్పూరు, రొంపిచెర్ల, కుంకలగుంట, పెద్ద నెమలిపురి స్టేషన్ల మీదగా పిడుగురాళ్ల వరకు ఈ ట్రైల్ రన్ ని అధికారులు విజయవంతం గా నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే జొన్ పరిధిలో న్యు డిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై రైల్వే లైన్ కి ప్రత్యామ్నాయం గా ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం చేపట్టారు. 2010-11 లో 2,452 కోట్ల అంచాన వ్యయం తో ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 2022 నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు-సికింద్రాబాదు మార్గంలో ఉన్న పిడుగురాళ్ల నుండి గూడూరు-కాట్పాడి లైన్ లోని వెంకటగిరి వరకు మొత్తం 308 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ మొదటిదశ పిడుగురాళ్ల నుండి శావల్యపురం వరకు నిర్మాణం పూర్తి అవ్వడంతో ఇప్పుడు లైన్ విద్యుద్దీకరణ పనులు మొదలుపెట్టబోతున్నారు.
గుంటూరు-సికిందరాబాద్ రూట్ లో ఉన్న నడికుడి నుండి మొదలయ్యే ఈ రైల్వే లైన్ పిడుగురాళ్ల, నకరెకల్, రొంపిచెర్ల, శావల్యపురం, వినుకొండ, గుండ్లకమ్మ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, దూబకుంట, ఆత్మకూరు, ఒబులయ్యపల్లె, రాపూర్ మీదుగా వెంకటగిరి స్టేషన్ లోని గూడూరు-రేణిగుంట లైన్ లో కలుస్తుంది. ఈ మార్గం నిర్మాణంతో చెన్నై హైదరాబాద్ ల మధ్య 120 కిమీ దూరం తగ్గడంతో పాటు రెండు గంటల సమయం ఆదా అవుతుంది. దీనితోపాటు ప్రకృతి విపత్తులు, తుఫానుల సమయంలో ఈ రైలుమార్గం మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.