Idream media
Idream media
జూన్ 13, చిన్నప్పుడు ఇదో సంక్షోభ దినం. స్కూల్ తెరుస్తారు. ఎండాకాలం సెలవలంటే ఆట, ఈత, సినిమాలు అదో ఇంద్రధ నస్సు. స్కూల్ అంటే చీకటి బిలం. అయిష్టంగా నిద్రలేచి, ఏడుపు ముఖంతో స్కూల్‌కి. వెళ్లే వరకే విషాదం. అక్కడ పాత స్నేహితుల్ని చూస్తే సంబరం. కొత్త తరగతి ప్రమోషన్. కొందరు మిత్రులు సెక్షన్లు మారి దూరమైపోతారు. కొత్తవాళ్లు వచ్చి కలుస్తారు.
ఆరో తరగతిలో ఆంధ్రా స్ట్రైక్‌తో సెలవలే సెలవులు. దానికి తోడు సమ్మర్ హాలిడేస్. అయినా సెవెన్త్‌కు పోవాలంటే ఏడుపు. ఆ రోజుల్లో సెవెన్త్ ఫెయిల్ అయ్యేవాళ్లు. కొంత మంది రెండుమూడు సార్లు కూడా. పాత కొత్త కలిపి ఒక్కో సెక్షన్‌లో 50 మంది. సెవెన్త్ స్పెషాల్టీ ఏమంటే F సెక్షన్ కూడా ఉండేది. A, B అంటే ఇంటెలిజెంట్స్. F అంటే పరమ మొద్దులని. మా క్లాస్‌లో మారన్న అని దండయాత్రల స్పెషలిస్ట్. కరెంట్ స్తంభమంతా పొడవుండేవాడు. సైకిల్ అద్భుతంగా తొక్కే వాడు. ఇంగ్లీష్‌లో వాడి పేరును కూడా తప్పుగా మూరన్న అనే రాసేవాడు. జూన్ 13వ తేదీ పెద్దవాళ్లైన ఫీలింగ్ వచ్చేది. సెవెన్త్ నుంచి సిక్స్త్ పిలగాళ్లని చూస్తే బచ్చాళ్లా కనిపించేవాళ్లు.
7 నుంచి 8కి వెళ్లినపుడు నేల నుంచి డెస్క్‌లకి ప్రమోషన్. చెక్క బెంచీ మీద కూచున్నప్పుడు సింహాసనం ఫీలింగ్. అయ్యవార్లు వచ్చి లెక్కల్లో చాయిస్ అడిగారు. భవిష్యత్‌లో ఇంజనీర్లు కావాలంటే కాంపోజిట్ మాథ్స్ లేదంటే జనరల్ లెక్కలు. నేను కాంపోజిట్ తీసుకోబడ్డాను. నా ప్రమోయం లేకుండా అయ్యవార్లే డిసైడ్ చేశారు. లెక్క లేకుండా జీవించే నాకు లెక్కలు తగిలించారు. ఎయిత్ కాంపోజిట్ లెక్కల పుస్తకం ఎంత లావుండేదంటే , దాంతో శత్రు సంహారం చేయొచ్చు.
లోకంలో పని లేని వాళ్లు కొందరుంటారు. వాళ్లు మన దుంప తెంచడానికి జామెట్రీ, ట్రెగనామిట్రీ కనిపెడతారు. సైన్, కాస్, టాన్, సీకెంట్ ఇవేం పదాల్రా అయ్యా! వీటి వల్ల రూపాయి అప్పు పుడుతుందా? ఆస్పత్రిలో ఆక్సిజన్ దొరుకుందా? ఇంటర్ ఫెయిల్ అవడానికి తప్ప ఈ లెక్కలు నాకెందుకూ ఉపయోగపడలేదు. ఏ థ్రిల్ లేకుండా నడిచిన తరగతి నైన్త్. నేర్చుకున్న చదువు గుర్తు లేదు కానీ, చెన్నవీర, లోక్‌నాథ్ అనే ఇద్దరు అన్నదమ్ములు మహత్తరమైన కృషితో పేకాట స్కూల్ ప్రారంభించారు. బాగా చదివే వాళ్లని పేకాటలోకి లాగడం వీళ్ల హాబీ. లెక్కలు రాని నాతో రమ్మీ ఆడించి కౌంట్ కరెక్ట్‌గా చేయించేవాళ్లు. బల్బుని చూస్తే ఎడిసన్, ఫోన్‌ని చూస్తే బెల్ గుర్తొచ్చినట్టు కార్డ్స్ ఎప్పుడు పట్టుకున్నా స్టెప్ కటింగ్‌తో ఉన్న చెన్నవీర గుర్తుకొస్తాడు.
టెన్త్‌కి అనంతపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి షిప్ట్. డెస్క్‌లు పోయి నేల వచ్చింది. కాకపోతే కోఎడ్యుకేషన్, అదో ప్లస్ పాయింట్. సోమశేఖరరెడ్డి అనే క్లోజ్ ఫ్రెండ్ . వాడు మైలవరం డ్యాంలో ఉండి వచ్చాడు. నీళ్ల కబుర్లు చెప్పేవాడు. వీడి స్నేహం చాలా కాలం సాగింది, ఎందుకంటే విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో పనిచేసేవాడు. ఈ మధ్య చనిపోయాడు. అతడి ప్లేస్‌లో కొడుకు బుక్‌హౌస్‌లో వున్నాడు.
టెన్త్‌లో 10 మంది పైగా అమ్మాయిలు. బాయిస్ స్కూల్లో చదవడం వల్ల వాళ్లని చూస్తే విపరీతమైన భయం. కేవలం దొంగ చూపులే. రత్న , పద్మ క్లాస్ బ్యూటీస్. బహుశా ఇప్పుడు మనుమరాళ్ల పెళ్లి పనుల్లో వుంటారు.
టెన్త్ తర్వాత జూన్ 13 ఎప్పుడూ భయపెట్టలేదు. ఇంటర్‌లో కాలేజీ కంటే లైబ్రరీకి వెళ్లిందే ఎక్కువ. అనంతపురం పబ్లిక్ లైబ్రరీ ఉదయం 8కి తెరిచేవాళ్లు. నేను 7.30కే కాపు కాసేవాన్ని. చెదపురుగులా ప్రతి పుస్తకాన్ని తినేసేవాన్ని. ఇంగ్లీష్ రాకపోయినా Blitz చదివేవాన్ని. దాని చివరి పేజీ బొమ్మ వేరే లెవెల్లో ఉండేది. చూసిన వాళ్లకి తెలుస్తుంది.
ఫిల్మ్‌ఫేర్‌లో IS. జోహర్ కొంటె సమాధానాలు, కారవాన్ పత్రికలో చివరి పేజీ పంచ్ డైలాగ్‌లు ఇవన్నీ ఇష్టం.
జీవితం ప్రత్యేకత ఏమంటే, మనం దేని నుంచి పారిపోతామో, అదే వచ్చి మనల్ని కౌగలించుకుంటుంది. సెలవల్ని విపరీతంగా Enjoy చేసే నేను, సెలవలే లేని , దొరకని జర్నలిస్టు ఉద్యోగాన్ని దశాబ్దాల పాటు చేశాను. ఈ జాబ్ చేయడమంటే వంద భగవద్గీతలు ఒకేసారి చదివిన దానితో సమానం. వేదాంతం వద్దన్నా వస్తుంది.
Also Read : కేంద్ర కేబినెట్ విస్తరణ : ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా?