iDreamPost
android-app
ios-app

Murder Case Odisha – హత్య కేసులో ఒడిశా మంత్రి ప్రమేయం? తొలిసారి ఆత్మరక్షణలో నవీన్ సర్కార్

  • Published Nov 03, 2021 | 7:43 AM Updated Updated Nov 03, 2021 | 7:43 AM
Murder Case Odisha – హత్య కేసులో ఒడిశా మంత్రి ప్రమేయం? తొలిసారి ఆత్మరక్షణలో నవీన్ సర్కార్

రెండు దశాబ్దాలకు పైగా ఒడిశాలో ఆ పార్టీదే అధికారం. ఆ నేతే ముఖ్యమంత్రి. వివాదాలకు తావులేకుండా, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఎదురులేని పాలన సాగిస్తున్న ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తొలిసారి ఆత్మరక్షణలో పడింది. ఇంతవరకు ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిందించే అవకాశమే ఇవ్వని బీజేడీ ప్రభుత్వం మొదటిసారి వాటి ఉచ్చులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితికి కారణం.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ మహిళా టీచర్ హత్య కేసు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దివ్యశంకర్ మిశ్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. హత్య కేసులోనూ మంత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి.. కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండు ఊపందుకుంది. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనలు, బందులతో గత 20 రోజులుగా రాష్ట్రం అట్టుడుకుతోంది. దీంతో నవీన్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.

టీచర్ హత్య ఎందుకు.. ఎలా జరిగింది?

కలాహాండిలోని సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బొలంఘిర్ జిల్లా ఝార్నీ గ్రామానికి చెందిన మమితా మెహెర్ (24) అనే యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. గత నెల ఎనిమిదో తేదీన పాఠశాల అధినేత అయిన గోవింద్ సాహు ఆఫీస్ పని ఉంది.. ఛందోతర గ్రామానికి రమ్మని చెప్పడంతో మమిత బస్సులో అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయింది. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆమె కోసం గాలించిన కుటుంబ సభ్యులు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరించారు. ప్రాథమిక ఆధారాలు గోవింద్ సాహు వైపే చూపడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రిక్రియేట్ చేశారు. చివరికి గోవింద్ సాహుయే ప్రధాన నిందితుడిని, తన పాఠశాలలో పనిచేస్తున్న మమితతో ఏర్పడిన విభేదాలతోనే ప్రణాళిక ప్రకారం హత్య చేసి పాఠశాలకు చెందిన స్టేడియం నిర్మాణ స్థలంలో మృతదేహాన్ని కాల్చివేశాడని గుర్తించారు. హత్య జరిగిన 11 రోజుల తర్వాత గత నెల 19న మృతురాలి శరీర అవశేషాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Maha Ex Home Minister -మహా మాజీ హోంమంత్రి అరెస్ట్.. జనాల్లో ఎంత పాపులారిటీ ఉన్నా, ఆ తప్పుతో దొరికేసి!

అట్టుడుకుతున్న రాష్ట్రం.. 

ప్రధాన నిందితుడు గోవింద్ సాహు రాష్ట్ర మంత్రి దివ్యశంకర్ మిశ్రాకు సన్నిహితుడు. సాహుకు మహాలింగ పేరుతో కళాశాల కూడా ఉంది. ఆ కళాశాలకు, దాని వసతి గృహాలకు మంత్రి మిశ్రా కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారని.. 2018లో కాగ్ నివేదిక కూడా దీన్ని తప్పు పట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి సదరు కళాశాలకు తరచూ వెళ్తుంటారని అంటున్నాయి. గోవింద్ సాహు గర్ల్స్ హాస్టల్ ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని, ఆ విషయం టీచర్ మమితకు తెలిసిపోవడంతో వాటిని బయటపెడతానని ఆమె బెదిరించింది. ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చేందుకు మంత్రి మిశ్రా రాయ్ పూర్లోని తన ఇంట్లో పలుమార్లు ఇద్దరితో చర్చలు జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మామిత అదృశ్యమైన రోజు అక్టోబర్ 8న ఉదయం కూడా గోవింద్ సాహు, మామితల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీటన్నింటి దృష్ట్యా ఈ హత్యలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. బందులు, రాస్తారోకోలు, ఘెరావ్ లతో రాష్ట్రం అట్టుడుకుతోంది.

ప్రభుత్వానికి ఇరకాటం

హత్య కేసులో రాష్ట్ర మంత్రి ప్రమేయం ఉందని.. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని నలువైపుల నుంచి ఆరోపణలు చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సీఎం నవీన్ ఇంతవరకు దీనిపై పెదవి విప్పలేదు. బీజేడీ నేతలు మాత్రం చట్టం తన పని చేసుకుపోతుందని ముక్తసరిగా చెబుతున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెసులు దీన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటుంటే.. ఏం చేయాలో అర్థం కాక అధికార పార్టీ అయోమయంలో పడింది.

Also Read : Bjp Himachal Pradesh -హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ పుట్టి మునుగుతోందా?