Idream media
Idream media
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (80) ఆదివారం రాత్రి తిరిగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మరోసారి లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఉదరకోశ సమస్యతో బాధపడుతున్న ములాయం సింగ్ గత ఐదు రోజులలో రెండోసారి అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. మొదటిసారి ఆయన గత బుధవారం రాత్రి ఉదరకోశ సమస్య, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స అనంతరం అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి శనివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశామని మేదాంత ఆసుపత్రి డైరెక్టరు డాక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు.
ములాయం సింగ్ కు కొలనోస్కోపి చేసి, ఉదరకోశ సంబంధ సమస్యను వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. మేదాంత ఆసుపత్రి డైరెక్టరు డాక్టర్ రాకేష్ కపూర్ ములాయం ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ “ఆయన పేగులలో వాపు ఉంది. కానీ ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది, త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యాన్ని గ్యాస్ట్రో సర్జన్ పర్యవేక్షిస్తున్నారు” అని వెల్లడించారు. ఇక ములాయం సోదరుడు, ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ ములాయం ఆరోగ్యం బాగుందని, ఆయన దీర్ఘాయువు కోసం ప్రజలు ప్రార్థనలు చెయ్యాలని కోరారు.
ఇక ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ మూడుసార్లు 1989–91, 1993-95, మరియు 2003–07 మధ్య కాలంలో పని చేసిన సంగతి తెలిసిందే. 1996 లోక్ సభ ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టడంతో పాటు దేశ రక్షణ శాఖ మంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిస్థాయి మెజార్టీ సాధించినప్పటికీ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య కుమారుడు అఖిలేష్ తో రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో పార్టీ అధ్యక్ష పగ్గాలను అఖిలేష్ చేజిక్కించుకున్నారు. 2019 జనరల్ లోక్ సభ ఎన్నికల్లో మెయిన్ పురి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి సుమారు 94 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొంది ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.