చాల రోజుల తరవాత కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖ రాశారు. కాపు ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని అణచివేయ్యడానికి తనని తన కుటుంబ సభ్యులని పోలీసుల చేత దారుణంగా కొట్టించారని బ్రిటిష్ వారి కంటే దారుణంగా చంద్రబాబు పరిపాలన సాగిందనే సంగతి ఆయన గుర్తు తెచ్చుకోవాలని ముద్రగడ హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదని ఆరోపిస్తున్న చంద్రబాబుకి తన నోటితో ఆ మాట పలికే హక్కు కూడా లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో ఆయన చేస్తే సంసారం.. మిగతా వారు చేస్తే వ్యభిచారమని ముద్రగడ మండిపడ్డారు.
తన సొంత సామాజికవర్గం మహిళలపై దాడి జరిగితే తన ఆస్థాన మీడియాని అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకి కాపు ఉద్యమ సమయంలో తన భార్య, కోడలిని తీవ్రంగా దుర్భాషలాడుతూ.. లాఠీలతో కొట్టుకుంటూ.. ఈడ్చుకెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ముద్రగడ ప్రశ్నించారు.
గత 15 రోజుల నుండి పోలీసులపై విరుచుకుపడుతున్న చంద్రబాబు తీరును తప్పుబడుతూ ముద్రగడ పద్మనాభం ఘాటైన పదజాలంతో చంద్రబాబుకి రెండు పేజీల లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పోలిసు వ్యవస్థని మొత్తాన్నీ బ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని ముద్రగడ తన లేఖలో ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన కాపు ఉద్యమాన్ని తన లేఖలో ప్రస్తావించిన ముద్రగడ, ఆ సమయంలో కిర్లంపూడిలో ఇంటిలో ఉన్న తన భార్యతో పాటు కొడుకు కోడల్ని లాఠీలతో దారుణంగా కొట్టించి అన్యాయంగా అరెస్ట్ చేయించడమే కాకుండా తనని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించారని, ఆ సమయంలో హాస్పిటల్ లో తనని కాలకృత్యాలు తీర్చుకోనివ్వకుండా, బట్టలు మార్చుకోనివ్వకుండా 8 మంది పోలీసులను తనకు కాపలా ఉంచమని ఏ చట్టంలో ఉందని ముద్రగడ తన లేఖలో చంద్రబాబుని ఘాటుగా ప్రశ్నించారు.
తన సామాజికవర్గం పై దాడి జరిగితే ఇది ప్రజాస్వామ్యమా ?? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకి కాపు ఉద్యమం జరిగినప్పుడు ఈ ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా ?? అసలు ఆ మాట అడగడానికి చంద్రబాబుకి నిజంగా సిగ్గుందా అంటూ ముద్రగడ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కాపు ఉద్యమ సమయంలో తమ గోడు చెప్పుకోవడానికి లేకుండా మీడియాని నియంత్రించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తన సొంత మీడియాలో తాను చెప్పిందే రాయించుకుంటూన్నారని ముద్రగడ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు పన్ని మామని వెన్నుపోటు పొడిచి ఆయనపై చెప్పులేయించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే రామారావు గారి చిత్రపటానికి దండలు వేస్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకి సరైన తీర్పు ఇచ్చారని, ఆ తీర్పుని గౌరవిస్తూ ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ముద్రగడ సలహా ఇచ్చారు.