iDreamPost
iDreamPost
టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లోనూ, మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి. ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఆ షాక్ నుంచి తెరుకోలేక పోతోంది. మిగతా నియోజకవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్న టీడీపీకి నూజివీడు నియోజకవర్గంలో మాత్రం తమ పార్టీ వర్గాల నుంచే సవాళ్లు ఎదుర్కోవాల్సిన విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి, ప్రస్తుత పార్టీ ఇంఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావును స్థానిక టీడీపీ శ్రేణులు తమ నాయకుడిగా అంగీకరించడం లేదు. దాంతో అక్కడ నాయకుడికి, క్యాడర్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.
ఇంకా వలస నేతగానే ముద్ర
గన్నవరానికి చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వర రావు 2004 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే గన్నవరంలో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను నూజివీడుకు షిఫ్ట్ చేసింది. దాంతో 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేరిన ముద్దరబోయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లోనూ మేకా చేతిలోనే మరోసారి ఓడిపోయారు.
వైఎస్సార్సీపీ బలంగా ఉండటానికి తోడు.. స్థానిక టీడీపీ క్యాడర్ సహాయ నిరాకరణ ముద్దరబోయిన రెండుసార్లు ఓడిపోవడానికి కారణంగా మారిందంటున్నారు. 2914లో నూజీవీడు నుంచి పోటీ చేసినప్పుడే ఆయన అక్కడ ఇల్లు తీసుకొని, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ లోకల్ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను ఇప్పటికే తమ లీడరుగా అంగీకరించడంలేదు. వలస నేతగా ట్రీట్ చేస్తూ.. ఏమాత్రం సహకరించకపోగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ కారణంతోనే ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు పరోక్షంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావుకు సహకరించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
Also Read : లోకేశ్.. ఇలా చేస్తే పార్టీకి డేమేజ్..!
పట్టించుకోని అధిష్టానం
ముద్దరబోయినను పార్టీ శ్రేణులు అంగీకరించడం లేదని.. ఆయనకు సహకరించడంలేదని టీడీపీ అధిష్టానానికి తెలుసు. అయినా ఆయన్నే నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తోంది. పైగా ఇక్కడ మూడోసారి ఎమ్మెల్యే అయిన మేకా ప్రతాప్ అప్పారావు బలం, వైఎస్సార్సీపీకి లభిస్తున్న ఆదరణ ముందు ముద్దరబోయిన, టీడీపీ రెండూ తేలిపోతున్నాయని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇంఛార్జిని మారిస్తే కొంతైనా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని.. కానీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.