iDreamPost
android-app
ios-app

రాష్ట్రంలోను, రాజ్య‌స‌భ‌లోను విజ‌య‌సాయి “ఉక్కు” సంక‌ల్పం

రాష్ట్రంలోను, రాజ్య‌స‌భ‌లోను విజ‌య‌సాయి “ఉక్కు” సంక‌ల్పం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కుదిపేస్తోంది. ప‌లు పార్టీలు, కార్మిక సంఘాలు ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం ఉద్య‌మం ఉధృతం చేస్తున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హ‌క్కు అనే నినాదాన్ని మ‌రోసారి గ‌ట్టిగా వినిపిస్తున్నారు. కేంద్రం ప్ర‌క‌ట‌న తొలి రోజుల్లో రాజీనామా చేసి హ‌ల్‌చ‌ల్ సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌ల్లో ఎక్క‌డా క‌నిపించడం లేదు. అధికార పార్టీ ఎంపీలు మాత్రం దీనిపై సీరియ‌స్ గా పోరాడుతున్నారు. ప్ర‌ధానంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలోను, రాజ్య‌స‌భ లోనూ త‌న ఉక్కు సంక‌ల్పాన్ని వీడ‌డం లేదు. కార్మికుల త‌ర‌ఫున‌, రాష్ట్రం త‌ర‌ఫున ప్లాంట్ పై త‌న వాయిస్ వినిపిస్తున్నారు. కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా బంద్‌, ఆందోళ‌న‌ల్లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్న ఆయ‌న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర కూడా చేప‌ట్టారు. ఇప్పుడు తాజాగా రాజ్య‌స‌భ‌లో మ‌రోసారి గ‌ళం వినిపిస్తున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం గురించి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్న ఆయన, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేశారు. ‘‘ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయి. కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ కొరత ఉందన్న విజయసాయిరెడ్డి, సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఈ విష‌య‌మై కేంద్రానికి రెండు సార్లు లేఖ‌లు రాశారు. అలాగే లోక్ స‌భ‌, రాజ్యస‌భ లో పోరాడాల్సిన తీరుపై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ఉద్య‌మంలో విజ‌య‌సాయి రెడ్డి కీల‌కంగా మారుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో గ‌తంలో ఆయ‌న చేప‌ట్టిన పాదయాత్ర ప్ర‌జ‌ల్లో భారీ స్పంద‌న ల‌భించింది. గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకు పాదయాత్ర చేప‌ట్టి అవ‌గాహ‌న క‌ల్పించారు. సుమారు 25 కి.మీ. మేర పాదయాత్ర చేప‌ట్టారు. అంతేకాకుండా 13 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే వైసీపీ ఇత‌ర ఎంపీలు లోక్‌సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మార్గాని భరత్, వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, డాక్టర్ బీవీ సత్యవతి ల‌తో ప‌లుమార్లు కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ క‌లిసి త‌మ వాయిస్ వినిపించారు. వైజాగ్ స్టీల్ ఫ్మాక్టరీ.. రాష్ట్రానికే ఆభరణం వంటిదని, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగమైందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పుడు రాజ్య‌స‌భ వేదిక‌గా ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు గ‌ళ‌మెత్తుతున్నారు.