iDreamPost
android-app
ios-app

Sujana Chowdary – సుజనా నోటా అదే మాట

  • Published Dec 28, 2021 | 1:56 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Sujana Chowdary – సుజనా నోటా అదే మాట

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందన్న దానిపై కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందని బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందని అన్నారు. మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షంగా ఏం చేయాలో టీడీపీ అది చేస్తే మంచిదని సుజనాచౌదరి హితవు పలికారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానమంత్రులు అయినా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, దాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ కదిలించలేరని అన్నారు.

బెదిరించడానికేనా ఈ వ్యాఖ్యలు?

కేంద్రం నిఘా వేసిందంటూ టీడీపీ నుంచి బీజీపీకి వలస వెళ్లిన ఎంపీ సీఎం రమేష్‌ ఆ మధ్య అన్న మాటలనే సుజనాచౌదరి తాజాగా పునరుద్ఘాటించారు. అధికారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించడానికి వారు తరచు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. టీడీపీనీ వీడినా వీరు ఇప్పటికే చంద్రబాబు లైన్‌ ప్రకారమే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. తాము అధికారంలోకి రాగానే అధికారుల పనిపడతామంటూ చంద్రబాబు బెదిరిస్తునట్టుగానే వీరు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా కేంద్రం నిఘా పెట్టిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసుకుపోతారు.  ప్రభుత్వం తీసుకొనే విధాన నిర్ణయాలకు అనుగుణంగా, నిబంధన మేరకు విధులు నిర్వహిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం వీరిపై నిఘా పెట్టినా, పెట్టకున్నా వీరి పనితీరులో మార్పుండదు. బెదిరించి అయినా అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహంతో, వారితో మైండ్‌గేమ్‌ ఆడడానికి వీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్న తరుణంలో వారిని బెదిరించి అభివృద్ధిని అడ్డుకోవాలనే రాజకీయ దురుద్ధేశంతోనే వారిపై కేంద్రం కన్నేసిందని సుజనా వ్యాఖ్యానించారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. సంక్షేమం, అభివృద్ధితో జనాదరణ పొందుతున్న తమ పార్టీ ప్రభుత్వానికి అటు అధికారులు, ఇటు పారిశ్రామిక వేత్తలు సహకరించకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

ప్రత్యేక హోదాపై తలో మాటా..

ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను నీతి ఆయోగ్‌ పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు కూడా పరిశీలిస్తుందని మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అందుకు విరుద్ధంగా అది ముగిసిన అధ్యాయమని, ఏకంగా జగన్‌, చంద్రబాబు ప్రధానమంత్రులు అయినా సాధ్యం కాదని సుజనాచౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ నేతల్లో నెలకొన్న గందరగోళానికి, సమన్వయ రాహిత్యానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నీతి ఆయోగ్‌ పరిశీలిస్తే ప్రత్యేక హోదా సాధ్యమే అని వ్యాఖ్యానించడం కాకుండా, నీతి ఆయోగ్‌ను ఒప్పించడానికి సోము వీర్రాజు ప్రయత్నిస్తే బావుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. తన ఆర్థిక నేరాల నుంచి, ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు సూచనతో బీజేపీలో చేరిన సుజనాచౌదరికి ప్రత్యేక హోదా, కేంద్రం నిఘా వంటి అంశాలపై మాట్లాడే అంత సీన్‌ లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని నిఘాలు పెట్టుకున్నా తమ పార్టీ ప్రభుత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజలకు మేలు చేస్తూ వారి ఆదరణ పొందుతూనే ఉంటుందని, బీజేపీ నేతల తాటాకు చప్పళ్లకు బెదిరేదిలేదని అంటున్నారు.