ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలి దశ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సోమవారం సమావేశాలు జరుగుతుండగా, వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు.
అప్రమత్తమైన సహచర ఎంపీలు వెంటనే స్ట్రెచర్ తెప్పించి ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. రేపటి వరకూ ఆస్పత్రిలోనే ఉంటే మంచిదని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. పిల్లి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. 1970లలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెండుసార్లు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కేబినెట్ లో ఓసారి ఆయన మంత్రిగా పనిచేశారు. 2012 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2019 ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తనకు అధిష్టానం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని చెప్పి గతంలో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్‌కు సన్నిహితుడయ్యారు. 2020 నుంచీ ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.