మంచి అభిరుచి కలిగిన కథలను ఎంచుకుంటాడని పేరున్న హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా భళా తందనాన నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. విశ్వక్ సేన్ గొడవ వల్ల ప్రేక్షకులకు అశోకవనంలో అర్జున కళ్యాణం రిజిస్టర్ అయ్యింది కానీ నిన్న ఇది కూడా వచ్చిందన్న సంగతి సాధారణ ఆడియన్స్ కు తెలియలేదు. అంత వీక్ గా ప్రమోషన్ చేశారు. క్యాస్టింగ్ తో పాటు మణిశర్మ సంగీతం లాంటి ఆకర్షణలు ఉన్నా సరైన రీతిలో పబ్లిసిటీ చేయడంలో టీమ్ విఫలమయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి వచ్చి హీరో దర్శకుడిని గొప్పగా పొగడటంతో మూవీ లవర్స్ ఒక లుక్ వేద్దామనుకున్నారు. ఇంతకీ భళా అనిపించిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.
చందు(శ్రీవిష్ణు) అనాథాశ్రమంలో అకౌంటెంట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శశిరేఖ(క్యాథరిన్ త్రెస్సా)తో లవ్ స్టోరీ ఉంటుంది. పేరుమోసిన హవాలా వ్యాపారి ఆనంద్ బాలి(గరుడ రామ్)కు సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల వార్త ఒకటి శశిరేఖ బయటికి తేవడంతో ఈ ఇద్దరూ అనుకోకుండా పద్మవ్యూహంలో చిక్కుకుంటారు. చందు కిడ్నాప్ కు గురవుతాడు. అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఛేజులు ఫైట్లు మొదలవుతాయి. ఇంతకీ ఆ రెండు వేల కోట్లు ఏమయ్యాయి, బుద్దిగా ఉద్యోగం చేసుకునే చందు ఇందులోకి దేని కోసం వచ్చాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. తారాగణం గట్టిగానే సెట్ చేసుకున్నారు.
బాణంతో గుర్తింపు తెచ్చుకున్న చైతన్య దంతులూరి ఆ తర్వాత తీసింది బసంతి ఒకటే. ఇది మూడోది. ప్లాట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసే క్రమంలో స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకపోవడంతో సెకండ్ హాఫ్ మొత్తం భళా తందనాన సహనానికి పరీక్ష పెడుతుంది. ట్విస్టులు కథలో భాగమైతేనే చూసేవాళ్ళు థ్రిల్ ఫీలవుతారు. అలా కాకుండా రచయితలు వాటి కోసమే తంటాలు పడితే జనం విసుగెత్తిపోతారు. దీంట్లో అదే జరిగింది. మణిశర్మలో మునుపటి మేజిక్ ఆశించడం ఇక అత్యాశే. గరుడ రామ్ కు విగ్గు పెట్టి అతనిలో ఇంటెన్సిటీని చంపేశారు. ఫైనల్ గా చెప్పాలంటే శ్రీవిష్ణు సక్సెస్ కోసం మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు.