Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రానికి చెందిన దళిత నేత మోత్కుపల్లి నరసింహులు. రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మోత్కుపల్లి అంటే తెలియని వారు ఉండరు. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మోత్కుపల్లి నరసింహులు 2019లో బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేకపోయిన మోత్కుపల్లి తాజాగా కషాయ కండువా తీసేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఏం చేస్తారనేది వెల్లడించలేదు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాప్ అక్కడ మొదలైంది..
దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తేబోతున్న దళిత బంధు పథకంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గత నెల ఆఖరున అన్ని పార్టీల నేతలతో ఓ సమావేశం నిర్వహించారు. దళిత సాధికారత కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలంటూ అందరి సలహాలు తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ దూరంగా ఉంది. అదే సమయంలో పార్టీ కార్యాలయంలో దళిత అభ్యున్నతిపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అయితే మోత్కుపల్లి నరసింహులు మాత్రం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. సదరు కార్యక్రమాన్ని పార్టీ బహిష్కరించినా మోత్కుపల్లి హాజరుకావడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఆదేశాలు పాటించడం లేదని మోత్కుపల్లిపై ఫిర్యాదుల చేశారు. తాను హాజరు కావడం వల్లే బీజేపీకి దళితుల్లో చెడ్డపేరు రాలేదని మోత్కుపల్లి తన చర్యను సమర్థించుకున్నారు. ఈ విషయంలో మొదలైన గ్యాప్ కొనసాగింది. అది కాస్త మోత్కుపల్లిని పార్టీని వీడేలా చేసింది.
బాబు చీల్చి చెండాడి బయటకు..
తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన మోత్కుపల్లి నరసింహులు రాజకీయ జీవితం రాష్ట్ర విభజన తర్వాత కుంటుపడింది. మోత్కుపల్లిని గవర్నర్‌ను చేస్తానంటూ చెబుతూ ఆయన సేవలను చంద్రబాబు తెలంగాణలో ఉపయోగించుకున్నారు. 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామి కావడంతో ఇక తనకు గవర్నర్ గిరి ఖాయమనుకున్నారు మోత్కుపల్లి. మహానాడు వేదికపై.. మోత్కుపల్లిని గవర్నర్‌గా పంపిస్తామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా.. గవర్నర్ గిరి దక్కడం లేదు. నాలుగేళ్లు గడిచాయి. 2018లో మోదీతో విభేదించి, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు చెప్పిన గవర్నర్ గిరిపై మోత్కుపల్లి ఆశలు వదిలేసుకున్నారు. తనను మోసం చేశాడని, వాడుకుని వదిలేశాడని మోత్కుపల్లి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు వ్యవహార శైలిని చీల్చి చెండాడారు.
టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆది నుంచి ఆసక్తి..
చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చే యడానికి కొన్ని రోజుల ముందు.. 2018 ఫిబ్రవరిలో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌లేదని, పార్టీని ఇక్కడ టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే మంచిదంటూ మోత్కుపల్లి సంచనల వ్యాఖ్యలు చేశారు. తద్వారా గులాబీ బాస్ దృష్టిలో పడాలని భావించారు. కేసీఆర్ తనను ఆహ్వానిస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమనేలా సంకేతాలు పంపారు. అయితే కేసీఆర్ ఆ పని చేయలేదు. తాము పిలిస్తే.. పదవులపై హామీలు ఇవ్వాల్సి వస్తుందని, మోత్కుపల్లి తనకు తానుగా వస్తే పరిశీలిద్దామనేలా గులాబీ బాస్ వ్యవహరించారు. నెలలు గడుస్తున్నా మోత్కుపల్లికి టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయన 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కారు ఎక్కడం ఇక లాంఛనమే.