iDreamPost
android-app
ios-app

వాజ్ పాయ్ ను మించిపోయిన మోదీ

వాజ్ పాయ్ ను మించిపోయిన మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ను మించిపోయారు. ప‌రిపాల‌న‌లో కాదు.. పాల‌నాకాలంలో. నరేంద్ర మోదీ గురువారం నాటికి సరికొత్త రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన నాలుగో వ్యక్తిగా రికార్డులోకెక్కారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ కు చెందిన నేత‌లు ఈ వ‌ర‌స‌లో ఉండేవారు. మోదీ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఆ స్థానంలో ఉన్నారు. వాజ్‌పాయ్ 2,268 రోజులు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఈ పదవీ కాలాన్ని మోదీ దాటిపోయారు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆ పార్టీ నేత‌ల‌తో పాటు ఇత‌ర రంగాల‌, పార్టీల ప్ర‌ముఖులు కూడా మోదీకి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

కాంగ్రెసేత‌ర ప్ర‌ధాని మోదీయే

కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను మోదీ అందుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు బాధ్యతల్లో ఉన్నారు. ఇందిరా గాంధీ 15 ఏళ్ల 350 రోజులు, మన్మోహన్ పది సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నారు. అత్యున్నత పదవిని చేపట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు నెహ్రూ సాధించారు. ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశానికి దిశానిర్ధేశం చేశారు.ఇక మరో రెండు రోజుల్లో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీలే కావడం గమనార్హం.