iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌కు భారతరత్న.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలంటున్న ఎమ్మెల్సీ

  • Published Jul 09, 2021 | 4:58 AM Updated Updated Jul 09, 2021 | 4:58 AM
వైఎస్సార్‌కు భారతరత్న.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలంటున్న ఎమ్మెల్సీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకున్నాయి. ఊరూ వాడా పెద్దాయనను తలుచుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులర్పించారు. వైఎస్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కు భారత రత్న ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ పై అదే పనిగా బురదచల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… రాజకీయంగా తలపండిన జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జీవన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. తెలుగువారి ఘనతను ప్రపంచానికి వైఎస్సార్ చాటి చెప్పారని, తెలుగు వారిలో భారతరత్నకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి ఆయనేనని చెప్పారు. తాము డిజైన్ చేసిన ప్రాజెక్టుగా మేఘా, టీఆర్ఎస్ చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వైఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లగా ఉన్న ప్రాజెక్టు పేరును కేసీఆర్ కాళేశ్వరంగా మార్చారని వివరించారు. నీళ్ల విషయంలోనూ తెలంగాణకు వైఎస్ ఎంతో చేశారని చెప్పుకొచ్చారాయన. వైఎస్ లేకపోతే తెలంగాణ ఎండిపోయేదన్నారు. కృష్ణా నదిపై తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. వైఎస్ తెలంగాణ పక్షపాతి అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డి మాత్రమే కాదు.. మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ సేవలను కొనియాడారు. వైఎస్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ లో లేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రైతులకు మేలు చేసేలా ఆయన కృషి చేశారని చెప్పారు. ఆఖరికి గతంలో వైఎస్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి కూడా.. వైఎస్సార్ బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. దట్ ఈజ్ వైఎస్సార్.

వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 12 ఏళ్లు అవుతున్నా.. ఆయన పాలనా కాలాన్ని జనం ఇంకా మరిచిపోలేదు. నాడు రాజన్న రాజ్యం నడిచేదని ఇప్పటికీ కీర్తిస్తారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 108 అంబులెన్స్ సేవలు.. ఇంకా ఎన్నో పథకాలను రాష్ట్రంలో అమలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైఎస్ హయాంలో ప్రతి ఇంట్లో లబ్ధి దారులు ఉన్నారు. అలాంటి పాలన సాగించారు కాబట్టే.. జనం బ్రహ్మరథం పట్టి రెండోసారి కూడా గెలిపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నేతలు తొడలు కొట్టి విర్రవీగితే.. ప్రజలకు ప్రేమతో ముద్దులు విసిరి.. అదే ప్రేమను తిరిగి పొందారు పెద్దాయన.

రాజకీయంగా వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు.. కానీ ఓ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కోట్ల మంది జీవితాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి వైఎస్సార్. ఎంతో మందికి స్ఫూర్తి కూడా. అందుకే వైఎస్ కు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వైఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి చేసిన ప్రస్తావనకు ప్రజల నుంచి కూడా మద్దతు దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తే అత్యున్నత పురస్కారం వచ్చి తీరుతుంది.

Also Read : త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానులు.. కేంద్రం సంకేతాలు?