iDreamPost
iDreamPost
అంతా ఊహించినట్టుగానే జరుగుతోంది. జగన్ తాను చెప్పిందే చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 మే 27న జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆయన చేసిన ప్రకటనను ఆచరణలో పెడుతున్నారు. దాంతో ఏపీ క్యాబినెట్ లో మార్పులు అనివార్యం అవుతున్నాయి. త్వరలో పూర్తిగా పునర్వవవస్థీకరణ జరగబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దానిని ధృవీకరించారు.
జగన్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. అయితే వంద శాతం మార్పులు ఉంటాయా లేక కొందరిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది స్పష్టత రాలేదు. దాని చుట్టూ అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇటీవల క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడుతూ జగన్ చెప్పింది చేస్తారు, కానీ తాను కొనసాగాలని మీరు కోరుకోవడం లేదా అంటూ మీడియాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి జగన్ తన తొలి క్యాబినెట్ కూర్పు సమయంలోనే రెండున్నరేళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిని పార్టీ అవసరాల కోసం వాడుకుంటామని ప్రకటించారు. కొత్తవారికి చాన్సిచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తామని వెల్లడించారు.
Also Read : తూర్పు గోదావరి జడ్పీ చైర్మన్ అయిన వారికి రాజయోగమే..!
ప్రస్తుతం మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యన్నారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి , పినిపే విశ్వరూప్ కి మాత్రమే గతంలో మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వంటి వారు ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయినందున ఏపీ క్యాబినెట్ నుంచి వారిద్దరూ వైదొలిగారు. ఈ తరుణంలో సీనియర్లను సైతం కొనసాగించే అవకాశం లేదని తాజాగా బాలినేని ప్రకటనను బట్టి తెలుస్తోంది. మొత్తం మంత్రులందరినీ మార్చేసి వివిధ జిల్లాల్లో పార్టీ వ్యవహారాల బాధ్యత వారికి అప్పగించబోతున్నట్టు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని మొన్నటి క్యాబినెట్ సమావేశంలో సీఎం చేసిన సూచనకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
మంత్రివర్గంలో వంద శాతం మార్పులు చేయబోతున్నారని, తాను మాత్రం విధాన ప్రకటనకు అనుగుణంగా దానిని సమ్మతిస్తానని మంత్రి బాలినేని తేల్చిచెప్పారు. క్యాబినెట్ లోని మిగిలిన మంత్రులు కూడా దానిని అనుసరించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే యువతకు అవకాశం ఇచ్చి రెండున్నరేళ్ల పాటు మంత్రివర్గంలో కొనసాగేందుకు ఛాన్సిచ్చిన జగన్ మరింత కొత్త నేతలతో మంత్రివర్గం కూర్పు చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా బాలినేని ప్రకటన తర్వాత వివిధ జిల్లాల నుంచి ఆశావాహల సందడి మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నవంబర్ నాటికి ఈ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తవుతుంది. దాంతో దసరా సందర్భంగా వచ్చే నెలలో ఈ పునర్వీవస్థీకరణకు ముహూర్తం పెడతారా లేక నవంబర్ వరకూ ఆగుతారా అన్నది ఆసక్తికరమే.
Also Read : విధేయతకే పెద్ద పీట, విశ్వాసంతో పనిచేసిన వారికి గుర్తింపునిచ్చిన జగన్