Idream media
Idream media
నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలు, అక్రమ రవాణా వ్యవహారంలో ప్రకాశం జిల్లాలో మరో గ్రానైట్ క్వారీపై వేటు పడింది. రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావులకు చెందిన పలు గ్రానైట్ క్వారీల అనుమతులను రద్దు చేసిన గనుల శాఖ అధికారులు తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గ్రానైట్ కంపెనీపై కొరడా ఝులిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రవాణా చేసిన వ్యవహారంలో ప్రకాశం జిల్లా బల్లికురవ వద్ద గరికపాటికి ఉన్న ఎస్‌ఆర్ గ్రానైట్స్‌కు గతంలో గనుల శాఖ అధికారులు 200 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అయితే ఈ విషయంపై గరికపాటి కోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా ఉపసమనం పొందారు.
తాజాగా ఈ విషయంలో గనుల శాఖ అధికారులు మళ్లీ గరికపాటి గ్రానైట్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ సారి నోటీసులకు సంజాయషీ ఇచ్చిన ఎస్‌ఆర్ గ్రానైట్.. ఆ తర్వాత జరిమానా చెల్లింపుపై పట్టించుకోవడం మానేసింది. గనుల శాఖ అధికారులు నేరుగా ఫోన్ చేసి కంపెనీ నిర్వాహకులకు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం గనుల శాఖ అధికారులు ఎస్‌ఆర్ గ్రానైట్‌కు పర్మిట్‌లు నిలిపివేశారు.
టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన గరికపాటి రామ్మోహన్ రావు ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ పార్టీకి తెరవెనుక వ్యవహారాలు చూసే వారిలో గరికిపాటి ఒకరుగా పేరొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. తమ అక్రమ వ్యవహారాలు, వ్యాపారాలు కాపాడుకోవడానికే టీడీపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా పలువురు నేతలు బీజేపీలో చేరినట్లు విమర్శలున్నాయి.