iDreamPost
android-app
ios-app

Municipal Elections – ఎవరు ఎక్కడ గెలిచారంటే..

Municipal Elections – ఎవరు ఎక్కడ గెలిచారంటే..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఇక మాదే రాజ్యం అని భావించిన టీడీపీ ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకరకంగా క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా దర్శి మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది. అయితే కొండపల్లి విషయంలో కాస్త సందిగ్దత కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో ప్రతిపక్ష టీడీపీకి అసలు అవకాశమే ఇవ్వకుండా వైసీపీ సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

కోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్ లో పడిన నెల్లూరు కార్పొరేషన్‌తో కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్ నిర్వహించింది. వీటితో పాటుగా గ్రేటర్‌ విశాఖ సహా విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలో ఖాళీగా ఉన్న వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. అయితే ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ నుంచే వైసీపీ అన్ని చోట్లా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తమ కంచుకోటలని టీడీపీ నేతలు భావించే కుప్పం, పెనుకొండలలో సైతం వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం పదమూడు చోట్ల ఎన్నికలు జరిగితే ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లిలో కూడా సందిగ్దత కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన టీడీపీ రెబల్ అభ్యర్ధి టీడీపీలో చేరినట్లు సమాచారం.

Also Read : TDP, Acham Naidu – మైండ్‌ బ్లాంక్‌ అయిందా అచ్చెన్నా?

ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి టీడీపీ చైర్మన్ సీట్ దక్కించుకోవచ్చని చెబుతున్నా, చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి.. ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో వైసీపీ రికార్డులు సృష్టించిన 11 కార్పొరేషన్‌లతో పాటుగా 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కేవలం తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఒకటే దక్కడం గమనార్హం.

నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 54 స్థానాలు ఉండగా అందులో వైసీపీ 54 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ మరో పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేక పోయింది.

కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-15, టీడీపీ-5 సాధించాయి.

రాజంపేట మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా వైసీపీ-24, టీడీపీ -4, ఇతరులు-1 స్థానాలు గెలిచారు.

పెనుకొండ మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-18, టీడీపీ-2 గెలిచాయి.

ఆకివీడు మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-12, టీడీపీ -4, జనసేన-3, ఇతరులు-1 స్థానం గెలిచారు.

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 స్థానాలు ఉండగా వైసీపీ-18, టీడీపీ-13 గెలుపొందింది.

దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-11, టీడీపీ-7, జనసేన-1, ఇతరులు-1 స్థానాలు గెలిచారు.

గురజాల మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-16, టీడీపీ- 3, జనసేన-1 గెలిచాయి.

దర్శి మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ -7, టీడీపీ -13 గెలిచాయి.

బుచ్చిరెడ్డి పాలెం మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ-18, టీడీపీ-2 గెలిచాయి.

కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా వైసీపీ-19, టీడీపీ-6 గెలిచాయి.

కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా వైసీపీ-14, టీడీపీ- 14, ఇతరులు-1 గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన టీడీపీ రెబల్ అభ్యర్ధి టీడీపీలో చేరినట్టు సమాచారం.

ఇక బేతంచర్ల మున్సిపాలిటీకి మొత్తం 20 స్థానాలు ఉండగా వైసీపీ -14, టీడీపీ -6 గెలుపొందాయి.

గ్రేటర్ విశాఖలో 31, 61 డివిజన్లకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Also Read : Kuppam Municipality Results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ