iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మరో పొలిటికల్ యుద్ధానికి తెరలేస్తోంది. త్వరలో మినీ మున్సిపోల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, 11 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వచ్చే తీర్పును బట్టి నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చి.. సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికలు జరిగేది ఇక్కడే
రాష్ట్రంలో పలు కారణాలతో 32 మున్సిపాలిటీలు, 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. అయితే వాటిలోని 11 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్న విషయాన్ని ఎస్ఈసీ అధికారులు పరిశీలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలోని దర్శి, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లాలోని కుప్పం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం, అనంతపురంలోని పెనుకొండ మున్సిపాలిటీలు, నెల్లూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు కోర్టు అడ్డంకులేం లేవని ఎస్ఈసీకి అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో ఓటర్ల జాబితా, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలతో రిపోర్టు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
వీటికి కూడా..
గ్రామాల్లో నిలిచిపోయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీల విలీనం, వర్గీకరణ వంటి కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన 259 చోట్ల సర్పంచ్, వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవి కాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినా.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల నిలిచిపోయిన వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 223 వార్డుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 452 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
వైసీపీకి ఎదురుందా?
ఏపీలో వీస్తున్న ఫ్యాను గాలి దెబ్బకు సైకిళ్లు, గాజు గ్లాసులు పత్తాలేకుండా పోయాయి. 2019 ఏప్రిల్ లో మొదలైన వైసీపీ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. కొన్ని నెలల కిందట జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మినహా దాదాపు అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. దెబ్బకు బిత్తరపోయిన టీడీపీ.. ఏకంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఒకవేళ వాటి ఫలితాలు వెల్లడైతే.. అన్ని చోట్లా వైసీపీనే గెలిచే అవకాశాలున్నాయి. ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లకుండా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ రేంజ్ లో ఉంది వైసీపీ హవా. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని, వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమని చర్చ జరుగుతోంది.
కుప్పం.. ఆసక్తికరం..
ఇప్పుడు జరగబోయే మినీ మున్సిపోల్స్ లో ఆసక్తికర మున్సిపాలిటీ ఒకటి ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ మున్సిపల్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నిక వైసీపీ, టీడీపీకి కీలకంగా మారనుంది. కుప్పం నియోజకవర్గంలోని మెజారిటీ పంచాయతీలను వైసీపీ సాధించింది. ఇప్పటికే అక్కడ వ్యతిరేకతతో సతమతమవుతున్న చంద్రబాడు నాయుడు.. కుప్పం మున్సిపాలిటీ నిలబెట్టుకోవడం కష్టమే.