iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ కోసం మిల్కీ ఆప్షన్

  • Published Jul 02, 2020 | 6:00 AM Updated Updated Jul 02, 2020 | 6:00 AM
వకీల్ సాబ్ కోసం మిల్కీ ఆప్షన్

మహా అయితే ఇంకో నెల రోజులు నిరవధికంగా షూటింగ్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ పూర్తయిపోతుంది. థియేటర్లు తెరుచుకున్నాక మునుపటిలా జనాన్ని భారీ స్థాయిలో రప్పించే సత్తా దీనికే ఉందని బయ్యర్లు నమ్మకంతో ఉన్నారు. దిల్ రాజు సైతం వీలైనంత త్వరగా షూట్ ని పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయించే టార్గెట్ తో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇలాంటి స్టార్ హీరో నిర్మాతలు వెంటనే మొదలుపెట్టలేకపోతున్నారు. తక్కువ క్రూతో షూటింగ్స్ చేసుకుంటున్న టీవీ సీరియల్స్ నటీనటులకే కరోనా బెడద తప్పడం లేదు. అలాంటిది వయసు దృష్ట్యా పవన్ లాంటి వాళ్ళను సెట్ లో ఎక్కువ సేపు యాక్టివ్ గా ఉంచడం చాలా రిస్క్. అందుకే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.

పవనే కాదు అందరూ ఇదే తరహాలో ఆలోచిస్తూ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఓ హీరోయిన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేసింది కానీ ఇక్కడ పవన్ ఇమేజ్ దృష్ట్యా అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అందుకే కాస్త క్రేజ్ ఉన్న బ్యూటీనే ట్రై చేస్తున్నట్టు తెలిసింది. మొన్నటిదాకా శృతి హాసన్ పేరే బలంగా వినిపించింది. తాజా అప్ డేట్ ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నాతో చర్చలు జరుగుతున్నాయట. ఆ ఎపిసోడ్ లో చిన్న మార్పుతో పాటు ఓ పాటను కూడా ఇద్దరి మధ్య ఉండేలా స్క్రిప్ట్ ని చేంజ్ చేశారట. కానీ తను నిజంగా ఒప్పుకుందా లేదా అనేది మాత్రం అధికారికంగా తెలియలేదు. గతంలో ఈ ఇద్దరూ కలిసి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబులో నటించారు. ఫలితం ఏమంత ఆశాజనకంగా రాలేదు కాని ఆన్ స్క్రీన్ మీద ఇద్దరూ అబిమానులకు నచ్చారు.

ఎలాగూ తమన్నాకు ఇమేజ్ పరంగా క్రేజ్ ఉంది కాబట్టి దిల్ రాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు వినికిడి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ కు తమన్ స్వరాలు సమకూర్చారు. లాక్ డౌన్ కు చాలా రోజుల ముందే మగువా మగువా ఆడియో సింగల్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఆపై ఎలాంటి అప్ డేట్స్ యూనిట్ నుంచి లేవు. లీకైన పవన్ ఫోటో ఒకటి ఆన్ లైన్ లో రచ్చ చేసింది. దాని మీద దిల్ రాజు కేసు పెట్టేందుకు కూడా సిద్ధపడ్డారని తెలిసింది. ఏది ఎలా ఉన్నా థియేటర్లు ఓపెన్ అయ్యాక ఊపు తేవాల్సింది ఇలాంటి వకీల్ సాబ్ లే. అయితే చేతిలో ఇంకా నాని వి విడుదలకు సిద్దంగా ఉంది కాబట్టి పవన్ సినిమాని 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయొచ్చని ఫిల్మ్ నగర్ టాక్.