జమ్మూ కాశ్మీర్ లో గత రెండురోజులుగా పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ కు ఫలితం దక్కింది. సైన్యం చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను కాశ్మీర్ హతమర్చినట్లు సమాచారం.
దీంతో మూడు రోజుల క్రితం కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన వీరజనాన్ల ప్రాణత్యాగానికి సైన్యం ఘనమైన నివాళి అర్పించినట్లైంది. ఇటీవల హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ తన స్వగ్రామం బెయ్‌పొరకు వచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన దళాలు మంగళవారం రాత్రి గ్రామాన్ని దిగ్బంధించి ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి.
దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపి హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టినట్లు సమాచారం. కాగా రియాజ్ నైకు మృతిని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మరికొందరు అతడిని ప్రాణాలతో సైన్యం పట్టుకుందని వెల్లడిస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ తలపై 12 లక్షల రివార్డు ఉంది. ఒకవేళ రియాజ్ మరణిస్తే భారత సైన్యానికి పెద్ద విజయంగా భావించవచ్చు.
దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడేలా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది.