iDreamPost
android-app
ios-app

ఒకే కమల్ – విలక్షణ పాత్రలు – Nostalgia

  • Published Apr 11, 2021 | 7:41 AM Updated Updated Apr 11, 2021 | 7:41 AM
ఒకే కమల్ – విలక్షణ పాత్రలు – Nostalgia

మాములుగా హీరో డ్యూయల్ రోల్ తో సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి రిస్క్ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు వీటి కోసం కెమెరా ట్రిక్కుల మీదే ఆధారపడాల్సి వచ్చేది. కొన్ని సినిమాల్లో ఒకే ఫ్రేమ్ లో హీరో డబుల్ ఫోటోలో ఉన్నప్పుడు మధ్యలో ఉన్న లైన్ స్పష్టంగా తెరమీద కనిపించేది. బడ్జెట్ పరిమితులు, అప్పుడు అంతకంటే సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో ఇదే ఎక్కువ అనుకుని ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది నాలుగు పాత్రలను ఒక పెద్ద స్టార్ తో డీల్ చేయడమనే ఛాలెంజ్ ని స్వీకరిస్తే.  అది మైకేల్ మదన కామ రాజు అవుతుంది. దాని విశేషాలేంటో చూద్దాం

1990 సంవత్సరంలో ప్రముఖ తమిళ నిర్మాత పంజూ అరుణాచలం ఒక పాకిస్థానీ సినిమా రీమేక్ హక్కులను కొన్నారు. ఒకేసారి పుట్టిన నలుగురు కవల అన్నదమ్ములు చిన్నప్పుడే విడిపోయి పెద్దయ్యాక కలుసుకోవడం అనే పాయింట్ మీద రూపొందిన ఆ చిత్రం ఆయన్ను విశేషంగా ఆకట్టుకుంది. దాన్ని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హీరోగా తీయాలని ప్లాన్ చేశారు. ఆలోచన చెప్పగానే లోకనాయకుడు ఎస్ అన్నారు. రైటర్ క్రేజీ మోహన్ తో కలిసి కమల్ స్వయంగా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. హీరో పాత్రలు నాలుగు ఉన్నప్పటికీ హీరోయిన్లు ఖుష్బూ, ఊర్వశి, రూపిని ముగ్గురిని సెట్ చేసుకున్నారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు.

ఫైర్ ఆఫీసర్, కార్పొరేట్ కంపెనీ అధినేత, వంటలు చేసే బ్రాహ్మడు, రౌడీ షీటర్ ఇలా ఒకదానికొటి సంబంధం లేని పాత్రలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింగీతం వారు చెప్పిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా అరగంట పాటు కొండపైన ఉండే హిల్ స్టేషన్ ఇంట్లో క్లైమాక్స్ ని తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తుంది. ఛాయాగ్రహణం గౌరీ శంకర్ అందించినా చివరి ఘట్టంలో చాలా క్లిష్టమైన ఫ్రేమ్స్ ఉండటంతో ఆ భాగం మాత్రం కబీర్ లాల్ షూట్ చేశారు. తమిళంలో 1990 అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. తెలుగు వెర్షన్ 1991 మార్చి 7న రిలీజై ఇక్కడా ఘన విజయం అందుకుంది. అదుర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన చారి క్యారెక్టర్ కి ఇందులో కమల్ పాత్రకు సారూప్యతను గమనించవచ్చు