పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో పలుచోట్ల ఆందోళన కారుల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేఘాలయాలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్ సవరణ గురించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. CAB ను వ్యతిరేకించేవారు నిరభ్యంతరంగా ఉత్తరకొరియా వెళ్లొచ్చని అయన ట్వీట్ చేయడం వివాదాస్పదం అయ్యింది.
తథాగత రాయ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు, 1 మతం కారణంగా దేశ విభజన జరిగింది. 2.ఈ దేశానికి విభజిత ప్రజాస్వామ్యం అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చని ట్వీట్ చేశారు.అయన వ్యాఖ్యలపై నిరసనగా ఆందోళన కారులు రాజ్ భవన్ ని చుట్టూ ముట్టే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులను భద్రతా దళాలు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ను కూడా నిరసన కారులపై ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటుగా పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
బాధ్యతాయుత గవర్నర్ పదవిలో ఉండి తథాగత రాయ్ ఇలా ట్వీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తథాగత రాయ్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.