iDreamPost
iDreamPost
అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన చరణ్ జిత్ చన్నీ చుట్టూ పాత వివాదాలు ముసురుకుంటున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం.. ఆయన వారసుడి ఎంపిక విషయంలో అనేక ట్విస్టులు చోటుచేసుకుని చివరికి ఎవరూ ఊహించని విదంగా దళిత సిక్కు సామాజికవర్గానికి చెందిన చరణ్ జిత్ చన్నీకి అదృష్టం వరించింది. కానీ ఆయనపై గతంలో ఉన్న మీటూ ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులతో పాటు నెటిజన్లు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలున్న నేతను సీఎంగా ఎంపిక చేయడాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటంతో కాంగ్రెసుకు కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి.
మూడేళ్ల నాటి వివాదం
చరణ్ జిత్ పై మీటూ వివాదం మూడేళ్ల క్రితం నాటిది. అప్పట్లో రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారిణికి చన్నీ అసభ్యకర టెక్స్ట్ మెసేజులు పంపారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. సదరు ఐఏఎస్ అధికారిణి చన్నీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మహిళా కమిషన్ సైతం ఆయనకు నోటీసులు పంపింది. విషయం తన దృష్టికి రావడంతో సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ చన్నీని మందలించడం.. ఆయన సదరు అధికారిణికి క్షమాపణలు చెప్పారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వివాదం పరిష్కారం అయినట్లు అమరీందర్ ప్రకటించడం.. ఆ మహిళా అధికారి తర్వాత కాలంలో రాష్ట్రం వీడి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో వివాదం క్రమంగా తెరమరుగైంది.
Also Read: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ
మళ్లీ తెరపైకి..
పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ చన్నీనే కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన మరుక్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లు మూడేళ్ల నాటి మీటూ ఆరోపణలను తవ్వితీసి.. సోషల్ మీడియాలో రీపోస్టు చేయడంతో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీకి ఇదో అస్త్రంగా మారింది. గతంలో 2018లోనే అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ పై సుమారు 20 మంది మహిళా జర్నలిస్టులు మీటూ ఆరోపణలు చేయడంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి ప్రధాని మోదీ తొలగించారు. దీన్నే ప్రస్తావిస్తూ మీటూ ఆరోపణలు ఉన్న నేతను ఏకంగా ముఖ్యమంత్రి చేయడం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెసులోని అసమ్మతివాదులు సైతం దీనిపై రచ్చ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ దీనిపై ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్ కు ట్విట్టర్లో 20 వేలమంది ఫాలోవర్స్ కూడా లేరని ఆయన సీఎం అయినప్పటి నుంచి కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఎత్తిపొడుస్తోంది. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎం అవుతున్న చరణ్ జిత్ కు ట్విట్టర్లో 600 మంది ఫాలోవర్స్ కూడా లేరంటూ బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. మొత్తం మీద దళిత నేతను సీఎం చేశామని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెసుకు.. మీటూ ఆరోపణలు అడ్డంకిగా పరిణమించాయి.
Also Read: అభ్యర్థులకు ఉన్న ధైర్యం అధినేతకు లేదా…?