iDreamPost
android-app
ios-app

ప్రపంచం దృష్టిని చదరంగం వైపు తిప్పిన “మ్యాచ్ ఆఫ్ ది సెంచరీ!”

ప్రపంచం దృష్టిని చదరంగం వైపు తిప్పిన “మ్యాచ్ ఆఫ్ ది సెంచరీ!”

జులై 11,1972 న ఐస్ ల్యాండ్ రాజధాని రెయ్క్ జావిక్ లో రష్యన్ ఛాంపియన్ బోరిస్ స్పాస్కీ, అమెరికన్ ఛాలెంజర్ బాబీ ఫిషర్ మధ్య జరిగిన చదరంగం ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఆ ఆట పట్ల ఆసక్తి ఉన్న వారినే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో రెండు అగ్రరాజ్యాలకు చెందిన ఆటగాళ్ల మధ్య మ్యాచ్ జరగడం, అప్పటి వరకు చదరంగంలో ఎదురు లేకుండా ఉన్న రష్యా ఆధిపత్యానికి ఒక అమెరికా ఆటగాడు తెరదించబోతున్నాడన్న ఊహాగానం అందరి ఆసక్తిని రెట్టింపు చేసింది.

ఈ మ్యాచ్ జరిగే నాటికి వియత్నాం యుద్ధంలో అమెరికా ఒకదాన్ని మీద ఒకటిగా ఎదురు దెబ్బలు తింటూ ఉంది. అమెరికా ప్రజానీకానికి, నాయకత్వానికీ ఫిషర్ చిన్న ఆశాకిరణంలా కనిపించబట్టి మీడియా కూడా ఈ మ్యాచ్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. రేడియో, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చదరంగం మీద ఆసక్తి ఉన్న వారు ఒక బోర్డు ముందు పెట్టుకుని ఆటగాళ్లు వేసే ఎత్తులు బోర్డు మీద వేసి, ఇద్దరి విజయావకాశాలను తమకు తెలిసినంతలో అంచనా వేస్తుంటే, ఆట గురించి తెలియని వాళ్ళు ఎవరు గెలుస్తారా అని చూశారు.

విపరీత స్వభావం

బాబీ ఫిషర్ స్వతహాగా కొంత విపరీత స్వభావం ఉన్న వ్యక్తి. తను స్వయానా యూదుడు అయినా కమ్యూనిస్టులు, యూదుల వల్ల ప్రపంచం నాశనం అయిపోతుందని నమ్మేవాడు. విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు కంటపడకుండా కొన్ని సార్లు పేపర్ కవర్లకు రంధ్రాలు పెట్టి, వాటితో మొహం కప్పుకుని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేవాడు.

ఈ మ్యాచ్ ఆడాలంటే కొన్ని కండిషన్లు పెట్టాడు ఫిషర్. ఒకటి ప్రైజ్ మనీగా ప్రపంచ చదరంగ సమాఖ్య ఇచ్చే లక్షా పాతికవేల డాలర్లు కాకుండా ప్రసార హక్కుల కోసం టెలివిజన్ ఛానళ్ళు చెల్లించే సొమ్ములో 30%, మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు టికెట్ల రూపంలో చెల్లించిన దానిలో 30% తనకు రావాలని పట్టుబట్టాడు. తన వల్లనే ఈ మ్యాచ్ కు అంత క్రేజ్ వచ్చిందని అతడి వాదన. ఆఖరు నిమిషంలో ఒక లండన్ చదరంగ ప్రియుడైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ లక్షా పాతిక వేల డాలర్లు డొనేషన్ ఇవ్వడంతో దానిని ప్రైజ్ మనీగా అప్పటికే అనౌన్స్ చేసిన సొమ్ముకు కలపడంతో ఫిషర్ సమ్మతించాడు.

ఐస్ ల్యాండ్ పోవడానికి విమానాశ్రయంలోకి వెళ్తుండగా ఒక్కసారిగా విలేకరులు చుట్టుముట్టడంతో చిరాకేసి, వెనుతిరిగి నేరుగా ఇంటికెళ్ళి పోయాడు ఫిషర్. దాంతో ప్రారంభోత్సవం ఫిషర్ లేకుండానే జరపాల్సి వచ్చింది. అప్పుడు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసెంజర్ స్వయంగా ఫోన్ చేసి, కమ్యూనిస్టు రష్యా ఆధిపత్యానికి గండికొట్టి, అమెరికా ప్రతిష్ఠ పెంచడం గురించి ఉత్తేజపూరితమైన చిన్న ఉపన్యాసం ఇవ్వడంతో ఫిషర్ తన జట్టుతో కలిసి విమానం ఎక్కాడు.

పరాజయాలతో ఆరంభం

మొత్తం ఇరవైనాలుగు గేములుంటాయి. గెలుపుకి ఒక పాయింట్, డ్రా అయితే అర పాయింట్ లభిస్తాయి. ఎవరు ముందు పన్నెండున్నర పాయింట్లు సాధిస్తే వారు ఛాంపియన్. ఇద్దరికీ పన్నెండు పాయింట్లు వచ్చి మ్యాచ్ డ్రా అయితే డిఫెండింగ్ చాంపియన్ గా స్పాస్కీ మళ్ళీ ఛాంపియన్ అవుతాడు. మొదటి గేమ్ నల్ల పావులతో మొదలు పెట్టాడు ఫిషర్. కాసేపటి తరువాత ఎవరికీ ఆధిక్యత లేకుండా డ్రా దిశగా వెళ్తున్న దశలో ప్రేక్షకులలో ఎవరో పదేపదే దగ్గుతూ ఉండడం, వేదిక మీద తెర వెనుక ఒకవైపు ఉన్న వీడియో కెమెరా సన్న శబ్దం చేస్తూ ఉండడం గమనించి, కెమెరాని తీసేయమని అడిగాడు ఫిషర్. అప్పటికప్పుడు తీయడం సాధ్యం కాదని కెమెరామెన్ చెప్పడంతో, ఆట కొనసాగించే, అనూహ్యంగా పొరపాట్లు చేసి ఓడిపోయాడు.

రెండు రోజుల తర్వాత రెండవ గేమ్ ప్రారంభం చేయాల్సి సమయానికి ఫిషర్ వేదిక వద్దకు రాకుండా అతని డిమాండ్లతో కూడిన లేఖ వచ్చింది. ప్రేక్షకులు లేకుండా, ఒక వీడియో కెమెరా మాత్రమే ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తానని ఫిషర్ అందులో రాశాడు. అయితే నిర్ణీత సమయంలో రెఫరీ గేమ్ ప్రారంభించి క్లాక్ స్టార్ట్ చేశాడు. రెండున్నర గంటల్లో ఒక ఆటగాడు నలభై ఎత్తులు వేయాల్సి ఉంటుంది. లేదంటే బోర్డు మీద పరిస్థితి ఎలా ఉన్నా ఓడిపోయినట్టే. ఈ గేమ్ లో ఫిషర్ తెల్లపావులతో ఆడాలి. ప్రత్యర్థి స్పాస్కీ వచ్చి బోర్డు ముందు కూర్చున్నాడు. రెండున్నర గంటల తరువాత అతను గెలిచినట్టు రెఫరీ ప్రకటించాడు. స్కోరు 2-0 అయింది.

ఆ తర్వాత చాలా తర్జనభర్జనల అనంతరం ప్రేక్షకులు లేకుండా ఆడడానికి స్పాస్కీ అంగీకరించారు. ఈ స్థాయిలో రెండు పాయింట్ల ఆధిక్యత అంటే దాదాపు మ్యాచ్ గెలిచేసినట్టే. వరుసగా గేములన్నీ డ్రా చేసినా సరిపోతుంది. ప్రత్యర్థి వాకౌట్ చేసి గెలవడం కన్నా, ప్రత్యర్థిని ఓడించి గెలవడం గౌరవప్రదంగా ఉంటుందని అతని ఆలోచన. తరువాత రెండు గేములూ అదే వేదికలో ఒకవైపు టేబుల్ టెన్నిస్ ఆడే గదిలో ఆడారు. ఇవి రెండూ ఫిషర్ గెలిచాడు. అక్కడ అంత సౌకర్యంగా లేకపోవడంతో, కెమెరా శబ్దం లేకుండా చూసుకుంటామని, ప్రేక్షకుల నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని నిర్వాహకులు చెప్పడంతో మళ్ళీ ఆట వేదిక మీదకు మారింది.

ఆ తర్వాత అయిదు గేములు గెలిచి, ఒక్క గేమ్ ఓడిపోయాడు ఫిషర్. మిగిలిన గేములు డ్రాగా ముగిసాయి. ఏదైనా గేమ్ అయిదు గంటల తర్వాత కూడా ఫలితం తేలకపోతే, అక్కడితో ఆపి మరుసటి రోజు కొనసాగిస్తారు. చివరి ఎత్తు వేయాల్సిన ఆటగాడు ఆ ఎత్తు బోర్డు మీద వేయడు. అలా వేస్తే దానికి పైఎత్తు ఏం వేయాలో ఆలోచించడానికి ప్రత్యర్థికి రాత్రంతా సమయం ఉంటుంది. తన ఎత్తు ఒక కాగితం మీద రాసి, కవరులో పెట్టి, సీల్ వేసి, రిఫరీ చేతికి ఇస్తాడు. మరుసటి రోజు ఆట మొదలయ్యాక రిఫరీ బోర్డు మీద ఆ ఎత్తు వేయడంతో ఆట మొదలవుతుంది. ఇరవై ఒకటో గేమ్ అలా ఆపే సమయానికి ఫిషర్ స్కోరు పదకొండున్నర పాయింట్లు. ఛాంపియన్ కావడానికి ఒక విజయం దూరంలో ఉన్నాడు. 21వ గేమ్ అయిదు గంటలయినా తేలకపోవడంతో ఫిషర్ తన ఎత్తు సీల్ వేసిన కవరులో రిఫరీ చేతికి ఇచ్చి, మరుసటి ఉదయం ఆట మొదలయ్యే సమయానికి వేదిక మీదకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికే స్పాస్కీ రిఫరీకి ఫోన్ చేసి తన ఓటమిని అంగీకరించాడు. 12 1/2- 8 1/2 స్కోరుతో ఫిషర్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.

తదనంతర పరిణామాలు

ఈ మ్యాచ్ తర్వాత రాత్రికి రాత్రి అమెరికాలో సెలబ్రిటీ అయిపోయాడు ఫిషర్. మిలియన్ డాలర్లతో మోడలింగ్ అవకాశాలు వస్తే వాటన్నింటినీ తిరస్కరించాడు. ఆ తర్వాత 1975లో ప్రపంచ ఛాంపియన్ షిప్ మ్యాచ్ కి తనవైపు నుంచి రెండు కండిషన్లు పెట్టాడు. ఎవరో ఒకరు పది గేములు గెలిచేవరకూ మ్యాచ్ ఆడాలి అన్న కండీషన్ ఒప్పుకున్నా, ఇద్దరూ తొమ్మిది గేములు గెలిస్తే డ్రాగా భావించి, తననే ఛాంపియన్ గా ప్రకటించాలన్న కండీషన్ చదరంగ సమాఖ్య అంగీకరించలేదు. దాంతో ఫిషర్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఆడలేదు.

ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించని బాబీ ఫిషర్ 1992లో బయటకు వచ్చి బోరిస్ స్పాస్కీతో మ్యాచ్ ఆడడానికి సిద్ధం అని ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించిన సెర్బియాలో ఆ మ్యాచ్ ఆడి గెలిచినా అమెరికా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తరువాత 2008లో మరణించేవరకూ ఫిషర్ మరెక్కడా కనిపించలేదు.