సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబు రేంజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా యావరేజ్ గా ఉన్నా ఈజీగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అంటే మాటలా. ఇక బ్లాక్ బస్టర్ అయితే తన సునామి ఏ లెవెల్ లో ఉంటుందో ఎన్నిసార్లు ఋజువు చేసిన మహేష్ చాలా ఏళ్ళ క్రితమే బాల నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 1979లో నీడలో చిన్న క్యామియో చేసిన మహేష్ ఫుల్ లెంత్ రోల్స్ కనిపించడం మొదలుపెట్టింది 1983లో వచ్చిన పోరాటం నుంచే. ఆ తర్వాత శంఖారావం, బజార్ రౌడీ ఇలా వరసగా చేసుకుంటూ పోవడం మొదలుపెట్టాడు.
1988లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు కొడుకులు మహేష్ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పెద్ద బ్రేక్ అని చెప్పొచ్చు. అభిమానులకు కనులవిందుగా ఇందులో మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూడా నటించారు. ఆ వెంటనే గూఢచారి 117తో మరో హిట్టు దక్కింది. ఇందులోనే తనలో డాన్సర్ ని పరిచయం చేశాడు ప్రిన్స్. 1989లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం మూవీ ఏకంగా మహేష్ నే టైటిల్ రోల్ లో తీసుకువచ్చింది. ఇందులో బ్రేక్ డాన్స్ తో షేక్ చేసిన మహేష్ డ్యూయల్ రోల్ లో ఫ్యాన్స్ ని కనువిందు చేశాడు. ఆ తర్వాత అన్న తమ్ముడు, బాల చంద్రుడులతో నటనకు విరామం ఇచ్చాడు. అలా చిన్నతనంలోనే ఘట్టమనేని అభిమానులకు కిక్ ఇచ్చిన మహేష్ అప్పట్లో పైన పిక్ చూపించినట్టు గుర్రపు స్వారీలు, రిస్కీ అనిపించే పోరాటలు, వావ్ అనిపించే డ్యాన్సులు ఎన్నో చేశాడు.
ఇప్పటికీ ఓం నమో నటరాజుకే నమో అనే పాటలో మహేష్ స్టెప్స్ తలుచుకుని మరీ మురిసిపోతారు ఫ్యాన్స్. కృష్ణ గారి రెండో అబ్బాయి రమేష్ బాబు సోలో హీరోగా కొన్ని సినిమాలు విజయాలు సాధించినప్పటికీ ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. కానీ మహేష్ అలా కాకుండా 1999లో రాజకుమారుడు రూపంలో పవర్ ఫుల్ డెబ్యూతో ఎంట్రీ ఇచ్చి ఇక అక్కడి నుంచి తిరుగులేని తారాపథంలో దూసుకుపోయి నిన్నటి సరిలేరు నీకెవ్వరు దాకా జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. నాన్న ఎంత స్టార్ హీరో అయినా టాలెంట్ లేనిదే నెగ్గుకురాలేని ఇండస్ట్రీ ఇది. అలాంటిది తనను అభిమానించే ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు రాణించడం అంత సులభం కాదు. అది చేసి చూపించిన అతి కొద్ది న్యూ జనరేషన్ స్టార్స్ లో మహేష్ ది ప్రత్యేకమైన స్థానమే.