iDreamPost
android-app
ios-app

రవితేజ లిస్టులో భలే డైరెక్టర్

  • Published Aug 06, 2020 | 5:29 AM Updated Updated Aug 06, 2020 | 5:29 AM
రవితేజ లిస్టులో భలే డైరెక్టర్

ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి తక్కువ టైంలోనే దూసుకుపోయిన దర్శకుడు మారుతీకి నాని భలే భలే మగాడివోయ్ ఇచ్చిన బ్రేక్ ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత వెంకటేష్, నాగ చైతన్య లాంటి అగ్ర హీరోలతో చేసిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ప్రతి రోజు పండగే మారుతిని మళ్ళీ ఫాంలో నిలబెట్టింది. అనూహ్య రీతిలో బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా చిన్నితెరపై కూడా సంచలనాలు రేపింది. దాని తర్వాత మారుతీ ఎవరితో చేయబోతున్నాడనే క్లారిటీ ఇప్పటిదాకా లేకపోయింది. కొద్ది రోజుల క్రితం  నానితోనే రెండో ప్రాజెక్ట్ చేయోచ్చనే టాక్ గట్టిగా వినిపించింది.

తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పుడు రవితేజతో గట్టి చర్చలు జరుగుతున్నాయట. మారుతీ చెప్పిన లైన్ నచ్చడంతో మాస్ మహారాజా దాన్ని డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడెలాగూ షూటింగులు జరగడం లేదు కాబట్టి ఆలోగా ఫైనల్ వెర్షన్ ను సిద్ధం చేసుకోవచ్చు. అయితే మారుతీ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ రావడం లేదు. సోషల్ మీడియాలోనూ ఆయన దీని గురించి ఏమి చెప్పలేదు. రవితేజ వైపు చూస్తేనేమో వరసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. క్రాక్ ఇంకొంచెం పెండింగ్ ఉంది. అది కాస్తా అయిపోతే థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అయిపోవచ్చు. దాని తర్వాత త్రినాధరావు నక్కిన, రమేష్ వర్మ, వక్కంతం వంశీలకు కమిట్ అయినట్టు ఇంతకు ముందే లీకయ్యింది. ఇప్పుడు మారుతీ ఖరారైతే వెయిటింగ్ లో నలుగురు అవుతారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ వేగంగా సినిమాలు పూర్తి చేయడం అంత సులభం కాదు. వ్యాక్సిన్ వచ్చాక కాని స్టార్లు బయటికి వచ్చేలా లేరు. కొందరు వచ్చినా మునుపటి దూకుడుతో చేసే అవకాశాలు లేవు. అందుకే రవితేజ ఇప్పుడీ సిరీస్ లో ఎవరిది ముందు మొదలుపెడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్రాక్ బిజినెస్ వ్యవహరాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాలు అమ్మేశారు. దసరాకంతా వైరస్ తగ్గుముఖం పడితే పండక్కు లేదా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతికి కేజిఎఫ్ తో సహా భారీ పోటీ ఉన్న నేపధ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.