iDreamPost
android-app
ios-app

ఏవోబీలో మరోసారి యుద్ధం తప్పదా?

ఏవోబీలో మరోసారి యుద్ధం తప్పదా?

ఆంధ్రా ఒడిస్సా బోర్డర్‌ (ఏవోబీ) మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోను కొట్టి చంపిన పోలీస్‌ ఏజెంట్లకు గుణపాఠం చెప్పి తీరుతామని మావో నేతలు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గణతంత్ర వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యారంటూ గత శనివారం (25వతేదీ) దాడికి దిగిన మావోలపై గిరిజనులు తిరగబడ్డారంటూ వార్తలు ఆ రోజున వార్తలు వెలువడ్డాయి. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి జొంతురాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అడ్మా అనే మావో అక్కడికక్కడే మృతి చెందగా, మరో మావో జిప్రోకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా మావోలందరూ పారిపోయారని అధికారులు చెప్పారు. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా మావోలు ఆడియో టేపును విడుదల చేశారు. ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ పేరిట బుధవారం ఆ టేపు విడుదలయ్యింది.

అందులో ఏముందంటే… ‘ఈనెల 25వ తేదీ రాత్రి బలిమెల రిజర్వాయర్‌ కటాఫ్‌ ఏరియాలోని కొన్ని గ్రామాల కార్యకర్తలను పోలీసు ఏజెంట్లు నిర్బందించారని తెలుసుకున్న మావోలు అక్కడికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు ఏజెంట్లు ముందస్తు ప్రణాళిక ప్రకారం మావోలపై దాడి చేసి కొట్టి చంపారు’ అని ఆడియో టేపులో పేర్కొన్నారు. పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి గిరిజనులపై మావోలు దాడికి దిగినట్లు ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంఘలు, మీడియా సంస్థలు ఈ ప్రాంతంలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. ఏవోబీలో పోలీస్‌ ఏజెంట్లు, ప్రజావ్యతిరేకులకు మావోయిస్టు పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని గణేష్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏవోబీలో తుపాకుల మోత మోగనుందని స్థానిక గిరిజనులు భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.