మణిపూర్ లో కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పోయింది. బిజెపి ప్రభుత్వానికి ఢోకా లేదు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపి)తో బిజెపి బేరసారాలు ఫలించడంతో మణిపూర్ రాజకీయ సంక్షోభ కథ సుఖాంతం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా జోక్యంతోనూ మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం కొనసాగనుంది. ఒకపక్క ఎన్పీపితో బేరసారాలు, మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఓ ఇబోబి సింగ్ పై సిబిఐ విచారణతో బిజెపి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది.
మణిపూర్ ఎన్పీపికి రాజీనామా చేసిన నలుగురు మంత్రులు మళ్లీ తిరిగి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్పీపి అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా తెలిపారు. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వారు చెప్పినట్లు వెల్లడించారు.
రాజ్యసభ ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం నుంచి తప్పుకున్న మంత్రులు తిరిగి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు. దీంతో మణిపూర్ కథ సుఖాంతం అయింది.