iDreamPost
iDreamPost
ఇండస్ట్రీలో ఏ నటుడికైనా బ్రేక్ ఎప్పుడు ఏ రూపంలో దక్కుతుందో చెప్పలేం. కొన్ని అనూహ్యమైన విజయాలు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. దానికి ఉదాహరణగా శరత్ కుమార్ ని చెప్పుకోవచ్చు. 1988లో సినీ రంగప్రవేశం చేసిన ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కెరీర్ తొలి రోజుల్లో ఎక్కువగా విలన్ వేషాలే వేశారు. 1989లో ‘పూలన్ విసరనై'(తెలుగులో పోలీస్ అధికారి)రూపంలో ప్రతినాయకుడిగా మొదటి బ్రేక్ లభించింది. అయితే హీరోగా సెటిలవ్వాలని ప్లాన్ చేసుకున్న శరత్ కుమార్ కు అలాంటి రోల్స్ ఎక్కువగా రావడం మొదలయ్యింది. తెలుగులోనూ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చివరి సినిమా ‘బాలచంద్రుడు’లో నటించిన రికార్డు తనకు ఉంది.
1991లో రెండు చిరంజీవి సినిమాల్లో అవకాశం రావడం శరత్ కుమార్ కు గొప్ప మలుపు అవుతుందనుకున్నారు కానీ అది జరగలేదు. ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ లో మెయిన్ విలన్ గా ఛాన్స్ ఇచ్చినా అది డిజాస్టర్ కావడంతో ఉపయోగం లేకుండా పోయింది. బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ లో రెండో అన్నయ్యగా మంచి క్యారెక్టర్ దక్కినా చిరు వన్ మ్యాన్ షో ముందు అది నిలవలేదు. అందుకే టాలీవుడ్ కాకుండా సీరియస్ గా తమిళంలోనే ట్రై చేయాలని డిసైడ్ అయిన శరత్ కుమార్ కు 1992లో ‘సూరియన్’ లాంటి సూపర్ హిట్ ద్వారా తాను కోరుకున్న లక్ష్యానికి బలమైన మెట్టు దొరికింది. పవిత్రన్ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతమందించగా కెటి కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమాలో రోజా హీరోయిన్.
దీన్ని తెలుగులో ‘మండే సూర్యుడు’ పేరుతో డబ్బింగ్ చేశారు. సెంట్రల్ మినిస్టర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న సూర్య(శరత్ కుమార్) ఓ మంత్రి హత్య కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో తానే పెద్ద మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. దీంతో అసలు దోషులను పట్టుకునే ఉద్దేశంతో వేషం మార్చుకుని ఎక్కడో దూరంగా ఉండే టాప్ స్లిప్ అనే హిల్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడే ఊరి పెద్ద కూతురు(రోజా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తను ఛేదిస్తున్న కుట్రకు మూలం అక్కడే ఉందని తెలుసుకుని ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వెళ్తాడు. సూరియన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక్కడా బాగా ఆడింది. శరత్ కుమార్ స్టార్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ పడలేదు.