iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి కొంత పట్టున్న నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. 2019లో జగన్ వేవ్ ని కూడా తట్టుకుని అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆపార్టీ తరుపున వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా మూడోసారి విజయం సాధించారు. వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ని ఓడించి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ గడిచిన రెండున్నరేళ్లుగా టీడీపీ అధినేత తీరుతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో అధికార పార్టీ నేతలతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా వారితో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేగుళ్ల జోగేశ్వర రావు వ్యవహారం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదనే చెప్పాలి.
మండపేటలో టీడీపీకి కమ్మ కులస్తుల కారణంగా ఆదరణ కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఆ సామాజికవర్గానికి చెందిన వారు అత్యధికంగా ఉండే నియోజకవర్గం ఇదే. దాంతో పార్టీ ఏదయినా మండపేటలో కమ్మ నేతలే గెలుస్తూ వస్తున్నారు. అందులోనూ టీడీపీ కి ఎక్కువ సార్లు విజయం దక్కింది. దానికి ప్రధాన కారణం ఎక్కువ సంఖ్యలో ఉండే బీసీలలో అనైక్యత, ఆ తర్వాత కాపు కులం నేతలు బలంగా ముందుకు రాలేకపోవడమే. గడిచిన రెండు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 2014లో కాపు కులానికి చెందిన గిరిజాల స్వామినాయుడుని, 2019లో బీసీ కులస్తుడు పిల్లి బోస్ ని బరిలో దింపినా ఫలితం దక్కలేదంటే అక్కడ కమ్మ కులస్తుల ప్రభావం, ఇతరుల్లో ఐక్యత లేమి బోధపడుతోంది.
2014 నుంచి 19 వరకూ వేగుళ్ల జోగేశ్వర రావు ఆడింది ఆట అన్నట్టుగా సాగింది. పెద్దగా వార్తల్లో ఉండేందుకు ప్రాధాన్యతనివ్వని ఆయన తన వ్యాపార, రాజకీయ వ్యవహారాలను మాత్రం సమర్థవంతంగా చక్కబెట్టుకుంటారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అందరితో సఖ్యతగా ఉంటూ వ్యాపార సామ్రాజ్యం నడుపుతూ ఉంటారు. అందులోనూ రైస్ మిల్లులకు ధాన్యం సేకరణ వంటి విషయాల్లో గానీ, ఇసుక దందాలో గానీ వేగుళ్ల ది అందెవేసిన చేయి అనే ప్రచారం ఉంది. పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ఆయన్ని ఆదరించారు. అయితే ఇటీవల స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎదురుదెబ్బ తిన్నారు. మునిసిపాలిటీతో పాటుగా మండలపరిషత్ లలో కూడా ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఢీలా పడ్డారు.
వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ వారసుడిగా అల్లుడిని బరిలో దింపేందుకు ఆయన అంతా సిద్ధం చేసుకున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల వైఎస్సార్సీపీ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్లడం మండపేట రాజకీయాలను మలుపుతిప్పేలా ఉంది. వెంటనే పార్టీ మారే ఆలోచన ఆయనకు లేనప్పటికీ ఎన్నికలు దగ్గర చేసి టీడీపీ బలహీనంగా కనిపిస్తే మాత్రం ఆపార్టీని వీడి వైఎస్సార్సీలో చేరడానికి సైతం ఆయన వెనకాడరని సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నియోజకవర్గం వైఎస్సార్సీపీ నేతలతో కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ జిల్లా కీలక నేతలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెబుతుంటారు. దాంతో వేగుళ్ల ఊగిసలాట చివరి క్షణంలో టీడీపీకి తలనొప్పి తెస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇదే టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది.
Also Read : Ex Mla Usharani- చిరంజీవిని ఓడించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడేమి చేస్తున్నారు?