iDreamPost
android-app
ios-app

మాచ్‌ఖండ్‌ డ్యామ్ గేట్ లో సాంకేతిక లోపం… తెగిన రోప్

మాచ్‌ఖండ్‌ డ్యామ్ గేట్ లో సాంకేతిక లోపం… తెగిన రోప్

ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో ఆంధ్ర – ఒడిశా రాష్ట్రాల మధ్య డుడుమ వాటర్ ఫాల్స్ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉండటం ఈ డుడుమ జలపాతం ప్రత్యేకత. నిజానికి 550 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఈ సమీపంలోనే మాచ్‌ ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ఉంది. డుడుమ వద్ద నుంచి చూస్తే ఒక జలపాతం, టిపి డ్యాం వద్ద నుంచి చూస్తే టిపి డ్యాం డిశ్చార్జ్‌ నీటితో కలిపి మొత్తం 3 జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే మాచ్‌ ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం డైవర్షన్‌ డ్యాం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఈ డుడుమ డ్యామ్ కు చెందిన రెండో నంబర్‌ పవర్‌ గేట్‌ వద్ద ఒక సాంకేతిక లోపం తలెత్తింది. తాకిడి ఎక్కువ కావడంతో బుధవారం నాడు పవర్‌ గేట్‌కు చెందిన బ్యాలెన్సింగ్‌ రోప్‌ అకస్మాత్తుగా తెగిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అధికారులు బ్యాలెన్సింగ్ రోప్ తెగినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే యుద్ద ప్రాతిపదికన తెగిపోయిన రోప్‌ని తొలగించి, కొత్త రోప్‌ను ఏర్పాటు చేసేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రమించినా దాన్ని సరిచేయలేక పోయారు.

ఈ కారణంగా డ్యామ్ నుంచి భారీగా నీరు వృథా అవుతోంది. డుడుమ డ్యాం నుంచి టన్నెల్‌ పాండ్‌ డ్యాంకు వెళ్లే నీటి మార్గంలో కెనాల్‌ మీద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కెనాల్‌కు సైతం ప్రమాదం పొంచి ఉందని కూడా చెబుతున్నారు. వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువున ఉన్న బలిమెల డ్యామ్‌లోకి చేరుతోంది. బ్యాలెన్సింగ్‌ రోప్‌ను గురువారం నాటికి యధాస్థానానికి అమర్చే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. లేకుంటే మరింత నీరు వృధా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.